
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డ వారినుంచి డిజిటల్ పేమెంట్ల ద్వారా లంచం తీసుకుంటున్న నలుగురు పోలీసులను ఉన్నతాధికారులు సస్పండ్ చేశారు. ఈ ఘటన బెంగళూరులో జరిగింది. ప్రజల నుంచి అనేకసార్లు ఫిర్యాదులు రావడంతో ఏసీపీలు సతీష్, కవిత స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఆ సమయంలో నలుగురు పోలీసులు కోరమంగళ సమీపంలోని శ్రీనివాగిలు జంక్షన్ వద్ద అనధికారిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా వీరు పోలీసు శాఖకు సంబంధంలేని ప్రైవేట్ ఆల్కోమీటర్లను ఉపయోగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే ఈ నలుగురు పోలీసులను అధికారులు సస్పెండ్ చేశారు. ఆ నలుగురు అసిస్టెంట్ సబ్ ఇన్‌స్పెక్టర్ మునియప్ప, కానిస్టేబుళ్లు గంగరాజ్, నాగరాజ్, హర్షలుగా అధికారులు తెలిపారు. వీరంతా అశోక్‌నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌కు సంబంధించిన వారుగా అధికారులు తెలిపారు. ఈ నలుగురు కలిసి అనధికారికంగా తనిఖీలు నిర్వహిస్తూ.. రశీదులు ఇవ్వకుండా జరిమానాలను పేటీఎం ద్వారా తీసుకుంటున్నారని అధికారులు తెలిపారు. వీరి నుంచి ఆల్కోమీటర్లతో పాటు, 32,000 రూపాయల నగదు మరియు చాలా మంది డ్రైవర్ల లైసెన్సులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడినందుకు ఈ నలుగురిపై వివేక్‌నగర్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.