హాస్టల్ లో బాలున్ని చంపింది పదో తరగతి విద్యార్దే

హాస్టల్ లో బాలున్ని చంపింది పదో తరగతి విద్యార్దే

పదో తరగతి విద్యార్థి చంపాడంటున్న పోలీసులు

కృష్ణా జిల్లా చల్లపల్లి బాయ్స్ వెల్ఫేర్ హాస్టల్ లో బాలుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. చల్లపల్లిలో సోమవారం అర్ధరాత్రి నారాయణ రావు నగర్ కు చెందిన మూడో తరగతి విద్యార్థి దాసరి ఆదిత్య(11) స్నానాల గదిలో చనిపోయి కనిపించాడు. దీంతో.. హాస్టల్ లో ఆ రోజు రాత్రి ఏం జరిగిందనేది సంచలనం రేపింది. చల్లపల్లి సి.ఐ వెంకట్ నారాయణ, ఎస్ ఐ నాగరాజు వివిధ కోణాల్లో దర్యాప్తు చేసి.. కేసును చేధించారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఓ టెన్త్ క్లాస్ స్టూడెంట్, ఆదిత్య ఇద్దరూ చిన్న విషయంలో గొడవపడ్డారు. తిట్టుకున్నారు. ఆదిత్య తిట్టాడని… ఆ సీనియర్ విద్యార్థి కోపం పెంచుకున్నాడు. రాత్రి 9 గంటల టైమ్ లోనూ ఓసారి ఇద్దరు విద్యార్థులు తిట్టుకున్నారు. వారిని హాస్టల్ వాచ్ మన్ మందలించాడు.

ఐతే… అదే సీనియర్ విద్యార్థి.. ఆదిత్యను రాత్రివేళ బాత్రూమ్ కు తీసుకెళ్లి హత్యచేశాడు. పెన్సిల్ చెక్కే చాకుతో మెడమీద కోసి బాత్రూమ్ లో పడేశాడు. హత్య చేసిన తర్వాత రక్తం మరకలు దుస్తులపై పడడంతో వాటిని సూట్ కేసులో దాచి వేరే దుస్తులు వేసుకుని… మళ్లీ వచ్చి తన రూమ్ లో తాను పడుకున్నాడు.

విద్యార్థులు గొడవపడ్డారని తెల్సుకున్న పోలీసులు… ఆ కోణంలో దర్యాప్తుచేశారు. పదో తరగతి విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

ఈ దారుణంపై కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ సీరియస్ గా స్పందించారు. డ్యూటీలో నిర్లక్ష్యంగా ఉన్న హాస్టల్ వాచ్ మన్ నాగరాజ్, హాస్టల్ ఇంచార్జ్ , వెల్ఫేర్ ఆఫీసర్ రామరాజులను సస్పెండ్ చేశారు.

దాసరి రవి, ఆదిలక్ష్మి దంపతులకు మొత్తం 4 మంది పిల్లలు. ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు. అందులో చివరి వాడు చనిపోయిన 11ఏళ్ల దాసరి ఆదిత్య. ఇల్లు హాస్టల్ కి 2 కి.మీ. దూరంలో ఉంటుంది. ఈ హాస్టల్ లో ఆదిత్య.. తన అన్నయ్య అశోక్ తో కలిసి ఉండేవాడు.