
హైదరాబాద్, వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా సోమవారం(జూన్ 12) ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్లో పోలీసులు ‘తెలంగాణ రన్’ నిర్వహించనున్నారు. తెల్లవారుజామున 4 గంటల నుంచి 8 గంటల వరకు జరగనున్న ఈ రన్లో పోలీస్ సిబ్బందితో పాటు కాలేజీల స్టూడెంట్లు, యువత పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ట్రాఫిక్ డైవర్షన్, వెహికల్స్ పార్కింగ్ వివరాలను వెల్లడిస్తూ సిటీ ట్రాఫిక్ చీఫ్ సుధీర్‌బాబు శనివారం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అఫ్జల్ గంజ్– సికింద్రాబాద్ మధ్య ట్రావెల్ చేసే ఆర్టీసీ బస్సులను తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ రూట్లలో డైవర్ట్ చేయనున్నారు. వాహనదారులు సహకరించాలని ఆయన కోరారు. వీఐపీల వెహికల్ పార్కింగ్ కోసం ఐమాక్స్ వద్ద, ఎంప్లాయీస్ కోసం కార్ రేసింగ్ రోడ్ దగ్గర, ఇతర వెహికల్స్‌కు జలవిహార్ వరకు సింగిల్ లేన్ పార్కింగ్ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
ట్రాఫిక్ డైవర్షన్ ఇలా..
- ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య విగ్రహం, నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్, తెలుగు తల్లి జంక్షన్ రూట్లలో ట్రాఫిక్‌ను అనుమతించరు.
- ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్‌రోడ్‌కు వచ్చే వెహికల్స్‌ను షాదన్ కాలేజీ, నిరంకారీ భవన్ మీదుగా దారి మళ్లించనున్నారు.
- నిరంకారీ భవన్, చింతలబస్తీ నుంచి ఖైరతాబాద్ఫ్లై ఓవర్ మీదుగా ట్రాఫిక్‌ను అనుమతించరు.
- ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, లిబర్టీ, రాణిగంజ్‌వైపు వెళ్లే ట్రాఫిక్‌ను తెలుగుతల్లి జంక్షన్, అంబేద్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్ మీదుగా అనుమతించరు.
- తెలుగుతల్లి ఫ్లైఓవర్, కట్ట మైసమ్మ, లోయర్ ట్యాంక్‌బండ్ మీదుగా దారి మళ్లించనున్నారు.
- ట్యాంక్‌బండ్, తెలుగు తల్లి జంక్షన్, బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ రూట్లలో వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌ను ఇక్బాల్ మినార్ జంక్షన్ మీదుగా దారి మళ్లిస్తారు.
- ఖైరతాబాద్బడా గణేశ్నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోడ్ వైపు ట్రావెల్ చేసే వెహికల్స్‌ను రాజ్‌దూత్ లేన్ నుంచి దారి మళ్లించనున్నారు.
- బుద్ధభవన్, నల్లగుట్ట జంక్షన్ నుంచి నెక్లెస్ రోడ్ వైపు వెహికల్స్ వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ ట్రాఫిక్‌కు రాణిగంజ్ నుంచి దారి మళ్లించనున్నారు.