రూ.4కోట్ల పందెం డబ్బుతో మరో చోట బెట్టింగ్

రూ.4కోట్ల పందెం డబ్బుతో మరో చోట బెట్టింగ్

కృష్ణా: ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ముందు ఆ రాష్ట్రంలో భారీ ఎత్తున బెట్టింగులు జరిగాయి. పందెం రాయుళ్లు రాజకీయ పార్టీల మీద కోట్ల మేర పందేలు కాశారు. ఈ క్రమంలో కృష్ణాజిల్లా నందిగామలో  ఓ ఇద్దరు వ్యక్తులు.. టిడిపి  గెలుస్తుందని ఒకరు ,వైసిపి అధికారంలో వస్తుందని మరొకరు రెండు కోట్ల పందేం కాశారు. ఏ పార్టీ విజయం సాధిస్తే.. ఆ పార్టీ పై పందేం కాసిన వ్యక్తికి రెండు కోట్లు ఇచ్చేలా ఒప్పందం.

వీరి ఒప్పందానికి  మధ్యవర్తిగా అదే  ప్రాంతానికి చెందిన అనుమోలు జనార్ధన్ అనే వ్యక్తిని ఎంచుకున్నారు. వారిద్దరి రెండు కోట్లు.. మొత్తం నాలుగు కోట్లు మధ్యవర్తి దగ్గర ఉంచారు. ఫలితాలు వచ్చాక  ఎవరైతే పందేం గెలుస్తారో వారికి రెండు కోట్లు ఇచ్చేలా నిర్ణయం తీసుకున్నారు. కాని ఆ మధ్యవర్తి అత్యాశతో ఆ నాలుగు కోట్లతో మరో వ్యక్తి దగ్గర  టీడీపీ గెలుస్తుందని పందెం కాశాడు. చివరకి ఫలితాలు తారుమారు కావడంతో అతడు నాలుగు కోట్లను పందెంలో ఓడిపోయాడు

మొదట పందెం కాసిన ఇద్దరు వ్యక్తులు రిజల్ట్స్ వచ్చాక జనార్ధన్ కలిసేందుకు వెళ్లగా, అసలు విషయం తెలిసి తమ డబ్బును తమకి తిరిగిచ్చేయాల్సిందిగా ఒత్తిడి తెచ్చారు. దీంతో వారి మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. చివరకు పోలీసుల వరకు ఈ విషయం చేరడంతో వారు జనార్ధన్ ను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు తమ రెండు కోట్లు పోయినందుకు లబోదిబోమంటున్నారు.