ఎన్నికలా.. ఏకగ్రీవమా? బల్దియా స్టాండింగ్‌ కమిటీ ఎంపికపై ఉత్కంఠ

ఎన్నికలా.. ఏకగ్రీవమా? బల్దియా స్టాండింగ్‌ కమిటీ ఎంపికపై ఉత్కంఠ
  • 15 సీట్లకు 17 మంది నామినేషన్లు
  • ఎంఐఎం నుంచి 8 మంది, కాంగ్రెస్​ నుంచి ఏడుగురు 
  • బరిలో ఇద్దరు బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు
  • వైదొలగకుంటే పోలింగ్​ అనివార్యం 
  • పోటీలో లేమని ప్రకటించిన బీజేపీ  
  • కాంగ్రెస్, ఎంఐఎంకు కలిసి వచ్చే చాన్స్​

హైదరాబాద్​ సిటీ, వెలుగు: బల్దియా స్టాండింగ్​ కమిటీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. బల్దియా ప్రస్తుత పాలకమండలి ఏర్పడినప్పటి నుంచి బీఆర్‌ఎస్‌–ఎంఐఎంల పరస్పర అవగాహనతో స్టాండింగ్‌ కమిటీలో నామినేషన్ ​వేసిన ఆ రెండు పార్టీల అభ్యర్థులు ఏకగ్రీమవుతూ వస్తున్నారు. ఈసారి అధికార కాంగ్రెస్​తో ఎంఐఎం జతకూడడంతో ఈ రెండు పార్టీల కూటమే స్టాండింగ్​కమిటీని దక్కించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అయితే, ఇద్దరు బీఆర్ఎస్​ కార్పొరేటర్లు కూడా నామినేషన్​ వేయగా, ఇద్దరు నామినేషన్లను విత్ డ్రా చేసుకుంటే తప్పా, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవయ్యే అవకాశాల్లేవు. అయితే, బీఆర్ఎస్​గెలిచే అవకాశం లేదు కాబట్టి నామినేషన్​వేసిన ఆ పార్టీ కార్పొరేటర్లు ఉపసంహరించుకుంటారని, కాంగ్రెస్​, ఎంఐఎం సభ్యులు ఏకగ్రీవం అవుతారన్న వార్తలు వస్తున్నాయి. 

ముగిసిన నామినేషన్ల పర్వం
నగరాభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, పౌర సేవల నిర్వహణకు సంబంధించిన తీసుకునే నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించే స్టాండింగ్ కమిటీ ఎన్నికకు సోమవారంతో నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఎంఐఎంకు చెందిన ఎనిమిది మంది కార్పొరేటర్లు, కాంగ్రెస్​నుంచి ఏడుగురు నామినేషన్లు వేశారు. నామినేషన్ల స్వీకరణ మొదలైన ఈ నెల 11న బీఆర్ఎస్, కాంగ్రెస్​పార్టీలకు చెందిన ఇద్దరు చొప్పున నలుగురు నామినేషన్లు వేశారు. చివరి రోజైన సోమవారం వరకు ఎంఐంఎం, కాంగ్రెస్​పార్టీల నుంచి మొత్తం 15 మంది, బీఆర్ఎస్​నుంచి ఇద్దరు మొత్తం 17 మంది బరిలో నిలిచారు. 

19 నుంచి విత్ డ్రాకు అవకాశం
బుధవారం నామినేషన్ల పరిశీలన ఉండగా, 19,20,21 తేదీల్లో విత్ డ్రాకు అవకాశం కల్పించారు. చివరి రోజైన 21న మధ్యాహ్నం మూడు గంటల వరకు నామినేషన్ల విత్ డ్రాకు ఛాన్స్​ ఉంది. ఉపసంహరణ గడువు ముగిసిన వెంటనే అదే రోజు బరిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. ఇదే జరిగితే స్టాండింగ్ కమిటీ ఎన్నిక బరిలో 15 మంది అభ్యర్థులు మాత్రమే ఉంటే, ఎన్నిక ఏకగ్రీవం కానుంది. 

లేని పక్షంలో ఈ నెల 25వ తేదీన పోలింగ్, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించేలా జీహెచ్ఎంసీ ఏర్పాట్లు చేసింది. కాగా, స్టాండింగ్ కమిటీ ఎన్నికకు బీజేపీ దూరంగా ఉంది. వారు ఓట్లు వేసే అవకాశం లేకపోవడంతో బీఆర్ఎస్​కు కలిసి వచ్చే అవకాశం లేదు. దీంతో వారు ఉపసంహరించుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

నామినేషన్లు వేసింది వీరే.. 
కాంగ్రెస్​ పార్టీ నుంచి కార్పొరేటర్లు మహాలక్ష్మి రామన్ గౌడ్, బూరుగడ్డ పుష్పా, సీఎన్ రెడ్డి, వి.జగదీశ్వర్ గౌడ్, భానోత్ సుజాత, బొంతు శ్రీదేవి, మహ్మద్ బాబా ఫసీయుద్దీన్ ​నామినేషన్లు వేశారు. ఎంఐఎం  నుంచి బతా జబీన్, సయ్యద్ మినహాజుద్దీన్, అబ్దుల్ వాహెబ్, మహ్మద్ సలీం, పర్వీన్ సుల్తానా, సమీనా బేగం, డాక్టర్ అయేషా ఉమేరా, గౌసుద్దీన్ మహ్మద్ నామినేషన్లు సమర్పించారు. అలాగే, బీఆర్ఎస్​కు చెందిన జూపల్లి సత్యనారాయణరావు, ప్రసన్నలక్ష్మి నామినేషన్లు వేశారు.