
టీఆర్ఎస్ రెండు వర్గాలుగా చీలిపోవడంతో అధికారులకు ప్రొటోకాల్ సమస్య ఏర్పడింది. ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరెవర్ని ఆహ్వానించాలో అర్ధం కాక వారికి తలనొప్పిగా మారింది. గతంలో ఒకే వర్గం ప్రజాప్రతినిధులు ఉండేవారు. ఇటీవల తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాలు ఏర్పడ్డాయి. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు కూడా చెరో వర్గంలో ఉన్నారు. అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచ్‌లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు ఉండటం గమనార్హం. ప్రభుత్వం నిర్వహించే ప్రతీ కార్యక్రమానికి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత ఆయా శాఖల అధికారులపై ఉంది.
ఇటీవల తాండూరు నియోజకవర్గంలో నిర్వహించిన పలు కార్యక్రమాలకు కేవలం ఒకే వర్గానికి సమాచారం ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. కోటపల్లి మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారం, తాండూరు, జనగామ్‌లో పత్తి కొనుగోలు కేంద్రాలకు పూర్తిస్థాయిలో సమాచారం ఇవ్వలేదు. కోటపల్లిలో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్సీ వర్గీయులకు సమాచారం ఇవ్వలేదంటూ మార్కెట్ కమిటీ కార్యదర్శి లక్ష్మణ్‌పై జడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. చోటా నాయకులు కూడా ఆయనపై మండిపడ్డారు. పెద్దేముల్ మండలం జనగామ్‌లో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ వైస్ ఎంపీపీ మధులతకు సమాచారం ఇవ్వలేదు. వారం రోజుల కిందట లక్ష్మీనారాయణపూర్ కొనుగోలు కేంద్రానికి ఎమ్మెల్సీ వర్గీయులు దూరంగా ఉన్నారు. తమకు సమాచారం ఇవ్వడం లేదంటూ మాజీ ఎమ్మెల్యే ఎం.నారాయణరావు పత్రికలకు ఎక్కిన విషయం తెలిసిందే..
మంత్రి సబితారెడ్డి పర్యటనలోనూ..
తాండూరు మండలంలో మంత్రి సబితారెడ్డి పర్యటన సమయంలోనూ కొంతమందికి అధికారులు సమాచారం ఇవ్వకుండా ఒకవర్గం ప్రజాప్రతినిధులు రాజకీయం చేశారని ఆరోపణలు చేశారు. పెద్దేముల్లో తమకు సమాచారం ఇవ్వకపోవడంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామని వైస్ ఎంపీపీ మధులత, సర్పంచ్ వర్గీయులు స్పష్టం చేశారు. ఇలా ఉండగా టీఆర్ఎస్కు చెందిన జిల్లా పరిషత్ వైస్‌చైర్మన్ బైండ్ల విజయకుమార్కూ అధికారులు, ఎమ్మెల్యేలు సమాచారం ఇవ్వలేదని కినుక వహించినట్లు తెలుస్తోంది. జిల్లాలో మంత్రుల, ఎమ్మెల్యేల పర్యటనలకు ప్రొటోకాల్ పాటించడం లేదని మనస్తాపానికి గురైయ్యారు. దీనిపై త్వరలో మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు ఆయన సన్నిహితులు చెప్పారు. కలెక్టర్చొరవ తీసుకుని ప్రొటోకాల్ పరిధిలోకి వచ్చే ప్రజాప్రతినిధుల జాబితా రూపొందించేలా జిల్లా అధికారులను ఆదేశించాలని కోరుతున్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రొటోకాల్ వర్తించే ప్రజాప్రతినిధులు జాబితా రూపొందించి పగడ్బంధీగా అమలు చేయాలని అంటున్నారు.