
- అధికారులపై పెరుగుతున్న రాజకీయ ఒత్తిళ్లు
- ఇల్లీగల్దందాలు చేయాలంటూ ప్రెజర్
- లీవ్‌లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్
- ట్రాన్స్ఫర్కోసం మరికొందరి ప్రయత్నాలు
మంచిర్యాల, వెలుగు: మంచిర్యాలలో రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుంటూ పనిచేయడం అధికారులకు సవాల్‌గా మారింది. బడా లీడర్ల నుంచి చోటామోటా నాయకుల దాకా ఆఫీసర్లపై జులుం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్టే వినాలని, అంతటా తమ మాటే నడవాలని ఒత్తిళ్లు వస్తున్నాయని, స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటూ రూల్స్ ప్రకారం పనిచేసే వెసులుబాటు లేకుండా పోయిందని అధికారులు తమ సన్నిహితుల వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలో మంచిర్యాలలో పని చేయడానికి ఆఫీసర్లు పోటీ పడేవారు. ఎక్కడెక్కడో పైరవీలు చేసుకొని పోస్టింగ్తెచ్చుకునేవారు. ఆ తర్వాత ట్రాన్స్ఫర్ అయినా కదలకుండా ఇక్కడే ఉండటానికి తమ పరపతిని ఉపయోగించేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. మంచిర్యాలలో పోస్టింగ్ అంటేనే చాలామంది జంకుతున్నారట. తెలిసో తెలియకో వచ్చినవాళ్లు ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అని చూస్తున్నారని టాక్ వినిపిస్తోంది.
ఆఫీసర్లపై పొలికటిల్ ప్రెజర్
వివిధ డిపార్ట్మెంట్లలో ప్రజాప్రతినిధులు, నాయకుల జోక్యం మితిమీరడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఔట్సోర్సింగ్ జాబ్స్, టెండర్లు, కాంట్రాక్టులు ఇలా ప్రతీది తాము చెప్పినవాళ్లకే ఇవ్వాలని, లేదంటే కథ వేరే ఉంటుందని కొంతమంది లీడర్లు బాహాటంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారని సమాచారం. రెవెన్యూ, మున్సిపల్, రిజిస్ట్రేషన్ఆఫీసుల్లో, పోలీస్స్టేషన్లలో ఏ పని కావాలన్నా లీడర్ల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. లీడర్ల ప్రెజర్వల్ల రూల్స్‌కు వ్యతిరేకంగా పనులు చేస్తూ ప్రజల్లో పలుచనవుతున్నామని పలువురు ఆఫీసర్లు వాపోతున్నారు.
ఇల్లీగల్ దందాలు, కేసులు చేయాలంటూ..
కొంతమంది లీడర్లు వారికి అనుకూలంగా ఇల్లీగల్దందాలు చేయాలంటూ ఆఫీసర్లను బలవంతం చేస్తున్నట్టు ఆరోపణలున్నాయి. మంచిర్యాలలో ఇటీవల భూముల రేట్లు విపరీతంగా పెరగడంతో లీడర్లంతా రియల్ ఎస్టేట్‌పై ఫోకస్ పెట్టారు. ఖాళీ జాగా కనిపిస్తే కబ్జాలకు పాల్పడుతున్నారు. పట్టా భూములతో పాటు గవర్నమెంట్, అసైన్డ్ ల్యాండ్స్‌ను దర్జాగా అమ్ముకుంటున్నారు. వివాదాస్పద భూముల్లో తలదూర్చి సెటిల్మెంట్లు చేస్తున్నారు.
కొందరు అధికారులు బాధ్యత మరిచి వీరికి అనుకూలంగా వ్యవహరిస్తుండగా.. నిజాయితీగా పనిచేసేవారు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. మంచిర్యాలలో దాడులు, కేసుల పరంపర నడుస్తోంది. ఎవరిపై కేసులు పెట్టాలో, ఏ సెక్షన్ల కింద నమోదు చేయాలో పోలీసులను లీడర్లే శాసిస్తున్నారని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. ఇలాంటి ఇల్లీగల్ దందాలు చేస్తే ఆ తర్వాత ఇరుక్కుపోవాల్సి వస్తుందని భయపడుతున్న కొంతమంది ఆఫీసర్లు ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నట్టు సమాచారం.
లీవ్‌లో వెళ్లిన కార్పొరేషన్ కమిషనర్
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ టి.శివాజీ 15 రోజులు లీవ్ పెట్టి వెళ్లారు. ఆయన ఇక్కడినుంచి ట్రాన్స్ఫర్ కోసం ట్రై చేస్తున్నారని, ఇక తిరిగి రాకపోవచ్చనే టాక్ వినిపిస్తోంది. లీడర్ల ఒత్తిళ్లు తట్టుకోలేక, ఇల్లీగల్ పనులు చేయడం ఇష్టం లేకనే శివాజీ లీవ్‌లో వెళ్లారని పొలిటికల్, అఫీషియల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. ఇటీవల నస్పూర్‌లో జరిగిన ఓ మీటింగ్‌లో అక్కడి లీడర్లు కమిషనర్‌పై ఆరోపణలు చేయగా, వాళ్ల సమక్షంలోనే బడా లీడర్ మాటలు తూలడంతో ఆయన నొచ్చుకున్నారట. ‘నేను చెప్పినట్టు పనిచేసేవాళ్లే ఇక్కడ ఉంటరు’ అంటూ ఆ లీడర్ వార్నింగ్ఇవ్వడం అధికార వర్గాలను మరింత కలవరపెడుతోంది. ఈ క్రమంలో మంచిర్యాలకు వచ్చేందుకు ఆఫీసర్లు ఇంట్రెస్ట్ చూపడం లేదని తెలుస్తోంది.