తెలంగాణలో మొదలైన చివరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఒంటి గంట వరకు పోలింగ్.. 2 తర్వాత కౌంటింగ్

తెలంగాణలో మొదలైన చివరి దశ పంచాయతీ ఎన్నికలు.. ఒంటి గంట వరకు పోలింగ్.. 2 తర్వాత కౌంటింగ్

హైదరాబాద్: తెలంగాణలో మూడో దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. బుధవారం (డిసెంబర్ 17) ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కొనసాగనున్నది. లంచ్​ బ్రేక్​ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్​ ప్రక్రియ మొదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను  వెంటనే ప్రకటించనున్నారు. మొదటి, రెండో విడత ఫలితాలను దిగ్విజయంగా వెల్లడించిన ఎస్ఈసీ ఈ విడతలోనూ అదే ఒరవడిని కొనసాగించేలా ప్లాన్​చేసింది. సర్పంచ్, వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే  ఉప సర్పంచ్ ఎన్నిక కూడా నిర్వహించనున్నారు. 

మూడో విడతలో 182 మండలాల్లో మొత్తం 4,159 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. అందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలుకాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది క్యాండిడేట్స్‌‌‌‌‌‌‌‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా, రెండు పంచాయతీలు, 18 వార్డుల ఎన్నికలు జరగడం లేదు.  

3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​.. 

మూడో విడత పోలింగ్‌‌‌‌‌‌‌‌ కోసం 36,483 పోలింగ్​ స్టేషన్లు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌‌‌‌‌‌‌‌కాస్టింగ్​ నిర్వహించనున్నారు.  4,502 మంది ఆర్వోలు, 77,618 మంది  పోలింగ్​సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు, 43,856 బ్యాలెట్​ బాక్స్‌‌‌‌‌‌‌‌లను అందుబాటులో ఉంచారు. పోలింగ్‌‌‌‌‌‌‌‌కు 3 రోజుల ముందు నుంచే బీఎల్వోలు ఇంటింటా తిరిగి ఓటరు స్లిప్పులను పంపిణీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.