
- గత వానాకాలంలో భారీ వర్షాలతో తెగిన 134 చెరువులు
- మానుకోట జిల్లాలో 25 చెరువుల మరమ్మతు పనులకు రూ.7 కోట్లు విడుదల
- ఆందోళనలో మిగిలిన 48 చెరువుల ఆయకట్టు రైతులు
మహబూబాబాద్, వెలుగు: నీటితో కళకళలాడాల్సిన చెరువులు కళతప్పాయి, ఎండిపోయి కనిపిస్తున్నాయి. అకాల వర్షాలతో కట్టలు తెగిపోయిన చెరువులు మరమ్మతులకు నోచుకోవడం లేదు. గత ఆగస్టులో అకాల వర్షాలతో మానుకోట జిల్లాలో 134 చెరువులు తెగిపోయాయి. 25 చెరువులను రైతులు, గ్రామస్తులు తాత్కలిక మరమ్మతులు చేసుకున్నారు. 25 చెరువుల మరమ్మతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. మిగిలిన చెరువుల మరమ్మతులకు నిధులు మంజూరు కాకపోవడంతో, ఈ నెల 25 నుంచి రోహిణి కార్తె ప్రారంభం కానుండడంతో చెరువుల ఆయకట్టు రైతులు తీవ్ర ఆందోళన
చెందుతున్నారు.
జిల్లాలో మొత్తం 1590 చెరువులు..
మానుకోట జిల్లాలో మొత్తం 1,590 చెరువులు ఉండగా, వీటి ఆధారంగా 95,480 ఎకరాల్లో పంటలకు సాగునీరు అందుతుంది. మున్నేరు, ఆకేరు, పాలేరు, వాగుల పై చెక్‌డ్యామ్‌ల నిర్మాణంతో, బోర్లు, బావుల ఆధారంగా వ్యవసాయం కొనసాగుతుంది. ఇటీవల వరుసగా సమృద్ధిగా వర్షాలు కురవడంతో రైతులు ఎక్కువగా పంటలను సాగు చేస్తున్నారు.
అకాల వర్షంతో చెదిరిన చెరువులు..
గత వానాకాలంలో భారీ వర్షంతోపాటు, వరద ఉధృతి పెరగడంతో జిల్లాలో 134 చెరువులు తెగిపోయి చుక్కనీరు నిలువ లేని పరిస్థితి ఉంది. ఇందులో 25 చెరువులను రైతులు స్వచ్ఛందంగా గండ్లు పూడ్చుకొని మరమ్మతు చేసుకున్నారు. కాగా, మొదట్లో 38 చెరువుల మరమ్మతుల కోసం ప్రభుత్వం రూ.2 కోట్లు రిలీజ్ చేయగా తాత్కాలిక మరమ్మతులు చేశారు. చెరువు కట్ట ఎత్తుకంటే తక్కువ ఎత్తులో మట్టిపోశారు. దీంతో ఇటీవల ఎస్సారెస్పీ జలాలు విడుదల చేయగా ఓ చెరువుకు బుంగపడి నీళ్లు కిందికిపోయాయి.
ప్రియారీటీ ప్రకారం మొదట్లో 78 చెరువుల మరమ్మతులకు రూ.20 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపించగా, ఇందులో కేవలం 25 చెరువుల మరమ్మతులకు రూ.7 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు 10 చెరువులకు మాత్రమే టెండర్లు పిలిచారు. మేజర్‌గా పనులు చేపట్టాల్సిన మరో 48 చెరువుల మరమ్మతులను పట్టించుకోకపోవడంతో అక్కడి రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.
తెగిన చెరువులకు మరమ్మతులు చేయాలి
గత వానాకాలం సీజన్లో తెగిన చెరువులను వెంటనే మరమ్మతులు చేపట్టాలి. చెరువులు నిండితేనే బోర్లు, బావులు ఉన్న రైతులకు సైతం పంటలు పండుతాయి. గత సీజన్లో ఎస్ఆర్ఎస్ పీ జలాలను విడుదల చేసినా కనీసం చెరువులలో నీరు నిల్వ చేసుకునే పరిస్థితి లేదు. కాలమైన పంటలు పండించుకోలేని దుస్థితి ఉంది. ఇప్పటికైన ఇరిగేషన్ ఆఫీసర్లు, నాయకులు స్పందించి చెరువులకు శాశ్వత మర్మతులు చేపట్టాలి.ఒర్రె రవి, రైతు, ఇనుగుర్తి గ్రామం