ఇయ్యాల రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ

ఇయ్యాల రాహుల్ గాంధీతో పొంగులేటి, జూపల్లి భేటీ
  • జులై 2న ఖమ్మం బహిరంగ సభలో కాంగ్రెస్‌లోకి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అగ్ర నేతలతో భేటీ అయ్యేందుకు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు ఢిల్లీ చేరుకున్నారు. వీరి వెంట పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ జనరల్ సెక్రటరీలతో వీరు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం సాయంత్రం ఢిల్లీ ఎయిర్‌‌పోర్టులో మీడియాతో పొంగులేటి మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్ ముఖ్య నేతలు చెప్పే సమాధానాన్ని బట్టి మా నిర్ణయం ప్రకటిస్తాం.

ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే. జులై 2న ఖమ్మంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రియాంక ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటాం” అని తెలిపారు. మొదటి విడతగా ఖమ్మం జిల్లాలతో పాటు కొన్ని నియోజక వర్గాల్లోని ముఖ్య నేతలు ఢిల్లీకి వచ్చినట్లు చెప్పారు. తెలంగాణలో ఆట మొదలు కాబోతున్నదని, ఆ ఆటను ఫర్ఫెక్ట్‌గా ఆడబోతున్నామని పొంగులేటి చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ బిడ్డలు తమ ఆత్మగౌరవం కోసం రాష్ట్ర ముఖ చిత్రాన్ని మార్చబోతున్నారని చెప్పారు. భవిష్యత్‌లో వివిధ పార్టీల నుంచి చాలా మంది కాంగ్రెస్‌లో చేరుతారన్నారు. తాము ఏ నిర్ణయం తీసుకున్నా అది తెలంగాణ బిడ్డల ఆత్మ గౌరవం, మంచికోసమే అని అన్నారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలే

రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి తన కాంట్రిబ్యూషన్ కూడా ఉందని పొంగులేటి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరలేదనని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఆ ఆకాంక్షలను నెరవేర్చుకోవడం కోసం రాజకీయ పునరేకీకరణ జరుగుతున్నదన్నారు. తాను ఏనాడూ పదవులను ఆశించలేదని, కాంగ్రెస్ పార్టీలో కూడా పదవులు ఆశించనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలతో భేటీలో పొంగులేటి, జూపల్లితోపాటు కొత్తగూడెం జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బానోతు విజయాబాయి, ఉమ్మడి ఖమ్మం జిల్లా ముఖ్య నేతలు పాల్గొనున్నట్లు తెలిసింది.