సీతారామ రీ డిజైన్ పేరుతో  ​నిధులు దుర్వినియోగం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

సీతారామ రీ డిజైన్ పేరుతో  ​నిధులు దుర్వినియోగం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి
  • ఉమ్మడి రాష్ట్రంలోనే ప్రాజెక్టు పనులు సగం పూర్తి
  • పెండింగ్​లోని 25 లక్షల ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరిస్తాం
  • త్వరలోనే ఆరోగ్యశ్రీ, రేషన్ కార్డులు అందజేస్తాం

సత్తుపల్లి, వెలుగు:   ఉమ్మడి రాష్ట్రంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్​ ప్రారంభించిన రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టు రీ డిజైన్ పేరుతో బీఆర్ఎస్​ నిధులు దుర్వినియోగం చేసిందని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. గురువారం సత్తుపల్లి మండల పరిధిలోని యాతాలకుంట సమీపంలో నిర్మించిన సీతారామ టన్నెల్ పనులను ఆయన పరిశీలించారు. పనుల పురోగతిపై ఇరిగేషన్, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు.  పనులు త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాజెక్టులకు రూ. 2400 కోట్లతో, 3.70 లక్షల ఎకరాలకు నీరందించేందుకు అంచనాలు రూపొందించి సగం పూర్తి చేశారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టులకు సీతారామ ప్రాజెక్టుగా పేరు మార్చి రూ. 18,500 కోట్ల అంచనాతో టెండర్లు ఖరారు చేసి, బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో రూ.8 వేల కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు. అందులోనూ పెండింగ్ ఉన్న రూ.975 కోట్ల బిల్లులు తాము చెల్లించామన్నారు.

ఖమ్మం జిల్లా రైతులకు సాగు నీరు అందించేందుకు ఏన్కూరు దగ్గర లింకు కెనాల్ ఏర్పాటు చేసి వైరా రిజర్వాయర్ కు గోదావరి నీళ్లు తరలిస్తున్నామని చెప్పారు. దీంతో 1.75 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. నాగార్జునసాగర్  ఆయకట్టును స్థిరీకరిస్తున్నామన్నారు. దీని ద్వారా వైరా, లంకాసాగర్ ప్రాజెక్టులతో  తొమ్మిది మండలాల్లోని మధ్యతరహా మైనర్ చెరువులకు, లిఫ్టులకు సాగునీరు అందుతుందని తెలిపారు. 

పదేళ్లలో చేసిన అప్పులకు వడ్డీలు కడుతున్నాం

పదేళ్లలో బీఆర్ఎస్​ ప్రభుత్వం చేసిన రూ. 7.19 లక్షల కోట్ల అప్పులకు ప్రతినెలా రూ.6 వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నామని పొంగులేటి అన్నారు. ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా  రైతులకు రుణమాఫీ చేసే పరిస్థితి లేనప్పటికీ రూ.31 వేల కోట్లతో రుణమాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధిని నిరూపించుకుందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లు వంటివని, త్వరలోనే కొత్త తెల్ల రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు అందజేయనున్నట్లు చెప్పారు. అర్హులైన వారందరికీ ఆసరా పెన్షన్లు అందిస్తామన్నారు. రైతుల కోసం ప్రభుత్వమే పంటల బీమా ప్రీమియం చెల్లించనున్నట్లు తెలిపారు.

ధరణిని బంగాళాఖాతంలో తొక్కుతామన్నారు. కొత్త భూ హక్కుల చట్టం కోసం అనుభవజ్ఞుల, న్యాయ నిపుణుల సలహాలు స్వీకరిస్తామని తెలిపారు. తెలంగాణలో భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ఎక్కడ నివసించినా ధీమాగా ఉండేలా కొత్త భూ చట్టం రూపొందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ రాజ్యంలో ప్రభుత్వ భూములు, చెరువు శిఖం భూములు, వక్ఫ్​ బోర్డు భూములు, భూదాన భూములు మినహా మిగిలినవన్నీ ఎల్ఆర్ఎస్ పథకం ద్వారా క్రమబద్ధీకరిస్తామన్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీఆర్ఎస్​ అసెంబ్లీలో ప్రస్తావించటం దుర్మార్గమన్నారు.

తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రాబోయేది మొదటి పంట అని గుర్తు చేశారు. జాబ్ క్యాలెండర్ ను అనుకున్న ప్రకారం ప్రకటించామన్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమాత్రం సహకరించడం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు తెల్లం వెంకటరావు, పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్​ ముజామ్మిల్ ఖాన్​, ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ మట్టా దయానంద్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి, ఎస్.ఈ శ్రీనివాసరెడ్డి, ఏ.ఈ నరసింహారావు పాల్గొన్నారు.