అవమానాలు భరించా..పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగం..

అవమానాలు భరించా..పొన్నాల లక్ష్మయ్య భావోద్వేగం..

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీలో తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని.. చివరకు అవి భరించలేకే ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇవాళ హైదరాబాద్‌లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. తాను కాంగ్రెస్‌ను వీడటానికి దారితీసిన కొన్ని కారణాలను వివరించే క్రమంలో పొన్నాల భావోద్వేగానికి గురయ్యారు.

 ‘‘45ఏళ్లలో నాలుగుసార్లు గెలిస్తే.. అందులో మూడు సార్లు వరుసగా గెలిచిన బీసీ అభ్యర్థి ఈ రాష్ట్రంలో మరెవరూ లేరు. 12 ఏళ్ల పైచీలుకు మంత్రిగా వివిధ శాఖలకు కొత్త రూపాన్ని తీసుకొచ్చిన వ్యక్తిని నేను. అయినా నాకు పార్టీలో అవమానాలు, అవహేళనలు. కొద్దిమందే తమ ప్రాధాన్యత కోసం ఇతరుల్ని కించపరిచే విధానం చూసి నాకు విసుగెత్తింది. 45 ఏళ్ల తర్వాత ఇంకా నేను తట్టుకోలేకపోయాను. 

‘1983 నుంచి 2023వరకు మూడు సార్లు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1989లో చెన్నారెడ్డి సారథ్యంలో, 2004, 2009లో వైఎస్ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వాలు ఏర్పాటుచేసినా.. తెలంగాణ ప్రాంతంలో 50శాతం సీట్లు రాలేదు. ఈరోజు 50శాతం సీట్లు రావాలంటే ప్రజా మద్దతు కూడగట్టాలి. ప్రజల మద్దతు ఎక్కడ లోపించిందని ఆలోచించడానికే పార్టీ నాయకులు అవకాశం ఇవ్వలే. అనుభవవాలు ఊరికే పోతాయా? బీసీ నేతగా నన్ను అవమానిస్తుంటే స్థానిక పార్టీ అలాగే ఉంటుంది. నా లేఖలో అన్ని విషయాలూ చాలా స్పష్టంగా చెప్పాను. ఇంకా అదనంగా ఏమీ మాట్లాడేదిలేదు’’అని పొన్నాల తెలిపారు. జనగామలో పోటీ, తన రాజకీయ భవిష్యత్తుపై ఏం మాట్లాడదలచుకోలేదని అన్నారు.


ALSO READ : హైదరాబాద్లో భారీగా నకిలీ మద్యం.. మీరు తాగే మద్యం అసలుదా..? కల్తీదా