పొన్నాల ఇంటికి కేటీఆర్.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ లోకి. !

పొన్నాల ఇంటికి  కేటీఆర్.. అక్టోబర్ 16న బీఆర్ఎస్ లోకి. !
  • బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానం.. న్యాయం చేస్తామని హామీ
  • నేడు ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలువనున్న పొన్నాల
  • రేపు జనగామ సభలో గులాబీ కండువా కప్పుకునే చాన్స్


హైదరాబాద్, వెలుగు: మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఇంటికి బీఆర్ఎస్​వర్కింగ్​ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్​శనివారం మధ్యాహ్నం వెళ్లారు. పొన్నాల కాంగ్రెస్​పార్టీకి శుక్రవారం రాజీనామా చేసినందున కేటీఆర్​ఆయన నివాసానికి చేరుకొని బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానించారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్​సూచన మేరకే ఆహ్వానించేందుకు వచ్చానని చెప్పారు. పార్టీలోకి వస్తే సముచిత గౌరవం ఇస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్​తో భేటీ కావాలని ఆహ్వానించారు. ఇందుకు పొన్నాల సానుకూలంగా స్పందించారు. ఆదివారం ప్రగతి భవన్​లో కేసీఆర్​ను కలిసిన తర్వాత తన నిర్ణయం ప్రకటిస్తానని ఆయన చెప్పారు. అనంతరం ఇద్దరు నాయకులు మీడియాతో మాట్లాడారు.

జనగామ సభలో చేరాలని కోరినం: కేటీఆర్

కేసీఆర్​ఆదేశాలతో పొన్నాల లక్ష్మయ్యతో తాను సమావేశమయ్యానని కేటీఆర్​ చెప్పారు. కాంగ్రెస్​కు రాజీనామా చేసిన ఆయనను బీఆర్ఎస్​లోకి రావాలని ఆహ్వానించామని తెలిపారు. జనగామలో సోమవారం నిర్వహించే ఎన్నికల ప్రచార సభలోనే పార్టీలో చేరాలని కోరినట్లు వివరించారు. బీఆర్ఎస్​లో చేరితే ఆయన హోదాకు తగ్గట్టుగా సముచిత గౌరవం కల్పిస్తామని తెలిపారు. కేకే, డీఎస్​లాంటి వాళ్లు చేరితే రాజ్యసభ సభ్యులుగా, ఇతర పదవులు ఇచ్చి గౌరవించుకున్నామని కేటీఆర్​ చెప్పారు. బీఆర్ఎస్ ​21 ఏండ్ల ప్రస్థానంలో ఎందరో బీసీలకు ఉన్నత పదవులు ఇచ్చిందని అన్నారు. ‘‘పొన్నాల లక్ష్మయ్యను సీనియర్​నాయకుడు అని కూడా చూడకుండా కాంగ్రెస్​నాయకులు అవమానకరంగా మాట్లాడుతున్నరు. రేవంత్​రెడ్డి ఎన్ని పార్టీలు మారలేదు.. ఆయన పార్టీలు మారొచ్చు కానీ ఇతరులకు పార్టీలో గౌరవం లేకపోతే పార్టీ మారొద్దా? రాజకీయాల్లో దిగజారుడు సంస్కృతి మంచిది కాదు. సచ్చే ముందు పార్టీ మారడం ఏంటని కొందరు లీడర్లు చిల్లరగా మాట్లాడుతున్నరు. ఓటుకు నోటు దొంగను పీసీసీ చీఫ్​కూర్చీలో కూర్చోబెట్టిన్రు కాబట్టే సీనియర్లకు గౌరవం ఉండటం లేదు” అని కేటీఆర్​ దుయ్యబట్టారు. పొన్నాల లక్ష్మయ్యకు బీఆర్ఎస్​న్యాయం చేస్తుందని ఆయన తెలిపారు. 

రేవంత్​ లాంటి వాళ్లు కాంగ్రెస్​ను భ్రష్టు పట్టించారు: పొన్నాల

రేవంత్​రెడ్డి లాంటి వాళ్లు కాంగ్రెస్​పార్టీని భ్రష్టు పట్టించారని పొన్నాల లక్ష్మయ్య మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్​లో చేరిన తర్వాత రేవంత్​ఎమ్మెల్యేగా ఓడిపోలేదా?  సిగ్గులేనిది ఎవరికో ప్రజలకు తెలుసు. నా గురించి మాట్లాడటానికి రేవంత్​రెడ్డి స్థాయి ఏమిటి? 2014, 2018 ఎన్నికల్లో పొన్నాల లక్ష్మయ్య ఒక్కడే ఓడిపోయాడా.. జానారెడ్డి, కోమటిరెడ్డి, ఉత్తమ్​సతీమణి ఓడిపోలేదా.. సమాధానం చెప్పాలి. రేవంత్​పీసీసీ అయ్యాక జరిగిన అన్ని ఎన్నికల్లో కాంగ్రెస్​ఓడిపోయింది.  ప్రతి ఉప ఎన్నికలో డిపాజిట్​కూడా రాలేదు. రేవంత్​ఎంపీగా ఉన్న మల్కాజిగిరి పార్లమెంట్​పరిధిలో జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్​ఎన్ని కార్పొరేటర్​స్థానాల్లో గెలిచిందో చెప్పాలి” అని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్​తనను కలిసి బీఆర్ఎస్​లోకి ఆహ్వానించారని, సీఎం కేసీఆర్​ను కలువాలని కోరారని పొన్నాల తెలిపారు. కేసీఆర్ ను కలిసి మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటానన్నారు. కేటీఆర్​వెంట ఎమ్మెల్యేలు దానం నాగేందర్, సైదిరెడ్డి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్, నాయకులు దాసోజు శ్రవణ్, వాసుదేవ రెడ్డి తదితరులు ఉన్నారు.