- హైదరాబాద్ లోక్‌సభ స్థాయి కాంగ్రెస్ సమావేశంలో మంత్రి పొన్నం ఆరోపణ
హైదరాబాద్, వెలుగు: ఓటర్ల సవరణ జాబితా (సర్) పేరిట అర్హుల ఓట్లను అక్రమంగా తొలగించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మంత్రి పొన్నం ప్రభాకర్ఆరోపించారు. బుధవారం గాంధీభవన్‌లో నిర్వహించిన హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు.
కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ నేతలు బీఎల్‌ఏలను సమన్వయం చేసుకుంటూ అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరును కూడా జాబితా నుంచి తొలగించకుండా చూడాలని కోరారు.
రసాభాసగా మారిన సమావేశం...
గాంధీ భవన్ లోని కార్యకర్తల సమావేశం రసాభాసగా మారింది. హైదరాబాద్ మంత్రి అజారుద్దీన్, జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలోనే సిటీ నేతలు గొడవకు దిగడంతో సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించుకొని మంత్రులు వెళ్లిపోయారు. ఇది చిన్న గొడవ మాత్రమేనని, గొడవపడ్డ నేతలు కలిసిపోయారని మంత్రి పొన్నం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు.
సర్ పై సమావేశం ప్రారంభం కాగానే నాంపల్లి కాంగ్రెస్ ఇన్చార్జి ఫిరోజ్ ఖాన్, కార్వాన్ ఇన్చార్జి ఉస్మాన్ ఇద్దరు సమన్వయ లోపంతో గొడవపడ్డారని, వాస్తవాలు తెలుసుకొని కలిసిపోయారని పొన్నం వివరించారు. ఇది పార్టీ అంతర్గత వ్యవహారమని తమ అసలు పోరాటం ‘ సర్’పైనే అని స్పష్టం చేశారు.
త్వరలో ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికలు
త్వరలో ఆర్టీసీలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి, తర్వాత విలీన ప్రక్రియ ప్రారంభిస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. బుధవారం ఆయన హైదరాబాద్లోని కూకట్‌పల్లిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రారంభించి మాట్లాడారు. ఏపీలో విలీనం తర్వాత చాలా సమస్యలు ఎదురవుతున్నాయని, భవిష్యత్తులో తెలంగాణలో అలాంటి ఇబ్బందులు రాకుండా విలీన ప్రక్రియ చేపడుతామని చెప్పారు.
దీనిపై తెలంగాణ మజ్దూర్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి అశ్వత్థామ రెడ్డి, తెలంగాణ ఆర్టీసీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రామావతారం, వెంకటేశ్వర్లు, తెలంగాణ మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కమల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తామని, విలీనానికే తమ ఫస్ట్ ప్రయారిటీ అని పేర్కొన్నారు.
