
హైదరాబాద్, వెలుగు: శ్రీరాంసాగర్ నీళ్లను తోడుకొమ్మని మహారాష్ట్రకు కేసీఆర్ చెప్పడం తెలంగాణకు ద్రోహం చెయ్యడమేనని కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. జీవనది లాంటి ఆ ప్రాజెక్టును మహారాష్ట్ర చేతికి ఇస్తే తెలంగాణలోని పరీవాహక ప్రాంతం శ్మశానం అవుతుందని విమర్శించారు. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, నల్గొండ ప్రాంతాలు ఎడారిగా మారుతాయని, ఎస్సారెస్పీ వరద కాలువ ప్రాజెక్టు వృథాగా మిగులుతుందని ఓ ప్రకటనలో ఆయన ఫైరయ్యారు.
సాగునీటి కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందని, తెలంగాణ హక్కుగా ఉన్న ఆ ప్రాజెక్టును మహారాష్ట్రకు అప్పగిస్తామంటే ప్రజలు ఛీకొడతారని హెచ్చరించారు. గోదావరిపై మహారాష్ట్ర కడుతున్న బాబ్లీ, ఇతర ప్రాజెక్టులపై ఎన్నో ఉద్యమాలు చేశామని, ఇప్పుడు అదే రాష్ట్రం మన నీళ్లను తోడుకుంటే చూస్తూ ఊరుకోవాల్నా అని ప్రశ్నించారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాటం చేసినోళ్లు ఇప్పుడు మంత్రులుగా ఉన్నారని, కేసీఆర్ వ్యాఖ్యలపై వాళ్లేం అంటారని నిలదీశారు. తన స్వార్థ రాజకీయాల కోసం గోదావరి నది నీళ్లనూ ఇచ్చేస్తున్నారని మండిపడ్డారు.