- ఎల్ నినో ప్రభావంపై సిద్దిపేట, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల ఆఫీసర్లతో సమీక్ష
హుస్నాబాద్, వెలుగు : ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొని రైతాంగాన్ని, ప్రజలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చెప్పారు. ఎల్‌నినో ప్రభావం- ప్రత్యామ్నాయ చర్యలపై గురువారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, వివిధ శాఖల అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తాగునీటి సరఫరాకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, ఎల్ఎండీ నుంచి అవసరమైన మేరకు నిరంతరాయంగా నీటి సరఫరా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి వారం భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తూ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని చెప్పారు. రైతులు వరి కాకుండా తక్కువ నీటితో సాగయ్యే మొక్కజొన్న, కందులు, పప్పుదినుసులు, చిరుధాన్యాల పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని సూచించారు.
ఒక గ్రామంలో 100 నుంచి 200 ఎకరాల వరకు ఆయిల్ పామ్ సాగు చేస్తే ఆ గ్రామానికి రూ.5 లక్షల ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని వెల్లడించారు. ఉపాధి హామీ, తెలంగాణ జలసిరి పథకాల ద్వారా ప్రతి ఇంటి వద్ద, ప్రభుత్వ కార్యాలయాల్లో ఇంకుడు గుంతలు, వ్యవసాయ భూముల్లో ఫాంపాండ్లు నిర్మించేలా చూడాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాలువల భూసేకరణ కోసం ఇప్పటికే రూ.250 కోట్లు మంజూరయ్యాయని, భూసేకరణ పూర్తిచేసి ప్రాజెక్టును త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికి చేర్చేలా అధికారులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు మంత్రి పొన్నం ప్రభాకర్ రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అయ్యప్ప ఆలయంలో నిర్వహించిన శ్రీ వారాహి మూలమంత్ర హోమ మహాయజ్ఞంలో పాల్గొన్నారు. అలాగే శ్రీకృష్ణ దేవాలయం, మరకత శివాలయంలో 108 కలశాలతో నిర్వహించిన వరుణ యాగంలో పాల్గొ్న్నారు. కార్యక్రమాల్లో సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి, హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి, కరీంనగర్ కలెక్టర్ చిత్ర మిశ్రా, హుస్నాబాద్ మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ పాల్గొన్నారు.
