
- బీఆర్ఎస్ను నిలదీసిన మంత్రి పొన్నం ప్రభాకర్
- బలహీన వర్గాలకు ఏం చేశారో చర్చిద్దామా అని సవాల్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్లో 23 ఏండ్లలో ఒక్క బీసీ నేత అయినా పార్టీ అధ్యక్షుడు అయ్యారా అని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనైనా బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాల్సిందన్నారు. శనివారం గాంధీ భవన్లో పొన్నం మీడియాతో మాట్లాడారు. గత పదేండ్లలో బీసీలకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. మాజీ మంత్రి కేటీఆర్ రాజకీయాల్లోకి రాకముందు రాజకీయాల గురించి మాట్లాడితే తెలియదు కావచ్చు అనుకున్నామని, కానీ పదేండ్ల పాటు మంత్రిగా, ముఖ్యమంత్రి కుమారుడిగా ఉండి, అత్తరి బిత్తిరిగా మాట్లాడితే ఎలా అని మండిపడ్డారు. తమ నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చెప్పిన విధంగా కులగణన తీర్మానాన్ని చేశామని, బీసీలకు రూ.150 కోట్లు విడుదల చేసి, 17 కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామని మంత్రి తెలిపారు. కాంగ్రెస్ పార్టీతోనే బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ నేతలు కూడా బలహీన వర్గాల ముఖ్యమంత్రి అన్నారని, చివరకు బీసీ అధ్యక్షుడిని తీసేశారని ఎద్దేవా చేశారు. బీసీ వర్గాలకు న్యాయం చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వివరించారు. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుని ప్రధాని నరేంద్ర మోదీ అవమానించారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం విభజన హామీలు నెరవేర్చలేదని కేంద్రంపై ఆయన ఫైర్ అయ్యారు.