తెలంగాణపై విషం కక్కి ఇప్పుడు మొసలి కన్నీళ్లా? : మంత్రి పొన్నం ప్రభాకర్

తెలంగాణపై విషం కక్కి ఇప్పుడు మొసలి కన్నీళ్లా? : మంత్రి పొన్నం ప్రభాకర్
  •     పవన్ కల్యాణ్ తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి
  •     ఆ తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలి 
  •     మంత్రి పొన్నం  సూచన

హుస్నాబాద్, వెలుగు: తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. తెలంగాణ ప్రజలకు తక్షణమే క్షమాపణ చెప్పిన తర్వాతే ఇక్కడ నవ నిర్మాణ సభ పెట్టుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సోమవారం పొన్నం మీడియా సమావేశంలో మాట్లాడారు. గతంలో తెలంగాణ ప్రజల చూపు పడితే కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయని పవన్ కల్యాణ్ విషం కక్కారని మండిపడ్డారు. తెలంగాణ ఏర్పడితే 11 రోజులు అన్నం మానేశానని బహిరంగంగా చెప్పిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజునే ఇక్కడ సభ పెట్టడం వెనక ఉద్దేశమేంటి? అని ప్రశ్నించారు. 

ఈ నవ నిర్మాణ సభలను బీజేపీ పాలిత రాష్ట్రాలైన గుజరాత్, యూపీ, మధ్యప్రదేశ్​లో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. తెలంగాణలో సభ పెట్టి, రెచ్చగొట్టే మాటలు మాట్లాడి, ఇక్కడి జనాల మధ్య ఘర్షణలు సృష్టించడమే  పవనిజమా అని ఫైర్​అయ్యారు. తెలంగాణలో బీజేపీ పప్పులు ఉడకడం లేదని, అందుకే దొడ్డిదారిన పవన్ కల్యాణ్ ను తమ ఏజెంట్​గా ఇక్కడికి పంపిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో విద్వేషాలు రెచ్చగొట్టి ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేయడానికి బీజేపీతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పవన్ ఈ నటన స్టార్ట్ చేశారన్నారు. బీజేపీ ఇచ్చే రెమ్యునరేషన్ కోసం ఇక్కడికి రాలేదని కొండగట్టు అంజన్న మీద ప్రమాణం చేసి చెప్పగలవా పవన్ అని సవాల్ విసిరారు. 

పెట్రో ధరలు, కులగణనపై ఎందుకు మాట్లాడలే..

పవన్ వ్యవహారం కన్న తల్లికి గాజులు కొనలేని వాడు పినతల్లికి ఒడ్డాణం చేయిస్తానన్నట్టు ఉందన్నారు. కుట్లే (కూటి) రాయి తీయనోడు.. ఎట్లో రాయి తీస్తాడా? అంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు ఆశీర్వదించి అధికారం ఇస్తే, అక్కడ నవ నిర్మాణం చూపించకుండా ఇక్కడికి రావడం ఏంటన్నారు. విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తుంటే, కృష్ణపట్నం, గంగవరం పోర్టులను అదానీకి కట్టబెడుతుంటే మోదీని ప్రశ్నించడం చేతగాని వ్యక్తి పవన్ కల్యాణ్ అని విమర్శించారు. దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతున్నా, కులగణన చేపట్టకపోయినా నోరు మెదపలేదన్నారు. 

చేగువేరా టీషర్టుతో ప్రస్థానం ప్రారంభించిన పవన్, ఇప్పుడు మోదీని కౌగిలించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నటుడుగా పవన్ ను అభిమానిస్తాం, ఆదరిస్తాం.. అంతే కానీ రాజకీయ నాయకుడుగా, తెలంగాణ వ్యతిరేకిగా వ్యవహరించే ఆయన్ను కచ్చితంగా నిలదీస్తామన్నారు. తెలంగాణ అస్తిత్వం మీద దాడి చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఎవరైనా పాల్గొనవచ్చని, కానీ ఇక్కడ విద్వేష రాజకీయాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.