- సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉంది
- బీసీ కార్పొరేషన్ల బలోపేతానికి చర్యలు తీసుకుంటాం
- కౌన్సిల్లో మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: బలహీన వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మంగళవారం కౌన్సిల్లో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ సామాజిక న్యాయానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. బలహీన వర్గాల పట్ల ప్రభుత్వం సానుకూల దృక్పథంతో పనిచేస్తోందని, బీసీ సంఘాల కార్పొరేషన్లను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
కల్యాణలక్ష్మి పథకంలో ఒక్క కేసు కూడా పెండింగ్‌లో లేకుండా గ్రీన్ ఛానెల్ ద్వారా దరఖాస్తులను వెంటనే క్లియర్ చేస్తున్నామని చెప్పారు. సమగ్ర కుటుంబానికి సంబంధించిన అంశంపై కేబినెట్‌లో చర్చ జరిగిందని, దీనిపై సబ్ కమిటీ సమీక్ష చేసి సభ ముందుకు తీసుకువస్తామని వెల్లడించారు.
బలహీన వర్గాల బిడ్డగా వారికి న్యాయం జరిగేలా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ నిధులు విడుదల కాలేదని, ఈ ఆర్థిక సంవత్సరంలో అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. విదేశీ విద్య కోసం ఇచ్చే స్కాలర్షిప్‌లను ఏడాదికి 300 మంది నుంచి 700కు పెంచినట్లు తెలిపారు. మహాత్మా జ్యోతిరావు పూలే గురుకులాల్లో మొత్తం 327 పాఠశాలలు ఉన్నప్పటికీ, కేవలం 27కే సొంత భవనాలు ఉన్నాయని, మిగిలినవి అద్దె భవనాల్లో నడుస్తున్నాయని చెప్పారు.
గతంలో అద్దె చెల్లించలేక పాఠశాలలకు తాళాలు వేసిన ఘటనలు ఉన్నాయని, తాము బాధ్యతలు చేపట్టిన తర్వాత అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కామారెడ్డి డిక్లరేషన్ అమలు దిశగా చర్యలు తీసుకుంటున్నామని, బీసీ సబ్ ప్లాన్ రూపొందిస్తున్నామని వెల్లడించారు. వివిధ కులాల కార్పొరేషన్లకు నిధులు కేటాయించడమే కాకుండా, సంచార జాతుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు. గతంలో బలహీన వర్గాల సంక్షేమం నిర్లక్ష్యానికి గురైందని, ఇకపై వారి అభివృద్ధి కోసం సభ్యుల సూచనలు తీసుకుంటూ ముందుకుసాగుతామని తెలిపారు.
