సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనోళ్లే ధర్నాలు చేస్తరా?: పొన్నం ప్రభాకర్

సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనోళ్లే ధర్నాలు చేస్తరా?: పొన్నం ప్రభాకర్
  • బీఆర్‌‌ఎస్‌ పాపమే వాళ్ల ఆందోళనకు కారణం: పొన్నం ప్రభాకర్‌‌
  • బకాయిలను మార్చి నెలాఖరులోగా చెల్లిస్తామని వెల్లడి 
  • ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలిటికల్ ట్రాప్‌లో పడొద్దని మంత్రి సూచన
  • ఈ పదేండ్లలో రాష్ట్రానికి కిషన్‌ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్పంచుల ఆత్మహత్యలకు కారణమైనొళ్లే వారికి మద్దతుగా ధర్నాలు చేస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌‌‌‌ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు సర్పంచుల గురించి మాట్లాడడం చూస్తే.. వంద ఎలుకలు తిన్న పిల్లి.. సామెత గుర్తుకు వస్తుందని చెప్పారు. పదేండ్లు అధికారంలో ఉన్నప్పుడు సర్పంచులకు బకాయిలు చెల్లించకుండా, వారి ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన పాపమే ఇప్పటి సర్పంచుల ఆందోళన అని అన్నారు. సోమవారం గాంధీ భవన్‌‌లో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. తాజా, మాజీ సర్పంచులకు రావాల్సిన బకాయిలకు రాష్ట్ర సర్కార్ గ్యారంటీ ఇస్తుందని, మార్చి నెలాఖరులోగా బకాయిలన్నింటినీ చెల్లిస్తామని స్పష్టం చేశారు. మాజీ సర్పంచులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని, పొలిటికల్ ట్రాప్‌‌లో పడొద్దని సూచించారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో అందరికి తెలుసని, కొద్దిగా ఓపిక పట్టాలని కోరారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని పొన్నం డిమాండ్‌‌ చేశారు. గత పదేండ్లుగా కేంద్రం తరఫున రాష్ట్రానికి కిషన్ రెడ్డి, మరో ‌‌‌‌కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన మేలు ఏమిటని ప్రశ్నించారు. 

కిషన్ రెడ్డి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే ముందు కేంద్రం రాష్ట్రానికి చేసిన మేలు ఏమిటో గుర్తు చేసుకోవాలన్నారు. కిషన్ రెడ్డి రక్తంలో తెలంగాణ డీఎన్ఏ లేదని, అందుకే ఆయన రాష్ట్రానికి ఏమీ చేయడం లేదని విమర్శించారు. కేసీఆర్ సలహా మేరకే కిషన్ రెడ్డి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని, అలాంటి వ్యక్తి తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన పార్టీ కాంగ్రెస్ అని, శవాల మీద పేలాలు ఏరుకునే పార్టీ బీఆర్ఎస్ అని అన్నారు. మూసీ పరివాహక ప్రాంత ప్రజలను బీఆర్ఎస్ రెచ్చగొట్టే కార్యక్రమం ముగిసిన తర్వాత, వారికి న్యాయం చేసేందుకు తాము అక్కడికి వెళ్తామని చెప్పారు. రాష్ట్రంలో జరిగిన వరద నష్టంపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌‌కు నివేదించామని, రూ.10 వేల కోట్ల నష్టం జరిగితే రూ.400 కోట్లు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. 

సర్పంచుల కాళ్లు పట్టుకొని క్షమాపణ అడుగు: విప్ ఆది శ్రీనివాస్ 

తాజా, మాజీ సర్పంచుల బకాయిలపై మాజీ మంత్రి హరీశ్‌‌ రావు, బీఆర్ఎస్ నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. హరీశ్‌‌ రావు సర్పంచుల కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడిగిన తర్వాతే, వారి గురించి మాట్లాడాలన్నారు. అధికారం పోయాక బీఆర్ఎస్ నేతలకు సర్పంచులపై ఎక్కడా లేని ప్రేమ పుట్టుకొస్తుందని సోమవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలోనే సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆరోపించారు. పదుల సంఖ్యలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నా.. ఆనాడు ఆ కుటుంబాలను పరామర్శించని హరీశ్‌‌, ఇప్పుడు వారికి మద్దతుగా ధర్నాలు చేయడం ఏమిటని ఫైర్ అయ్యారు. గ్రామాల్లో అభివృద్ధి పనుల పేరుతో వారిపై కత్తిపెట్టి రైతు వేదికలు, శ్మశాన వాటికలు కట్టించి, సర్పంచులను మానసికంగా, ఆర్థికంగా చితికిపోయేలా చేశారన్నారు. సమయానికి పనులు చేయని సర్పంచులను సస్పెండ్ చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం చేసిన పాపాలను ఒక్కొక్కటిగా కడుక్కుంటూ ముందుకు పోతున్నామన్నారు. అన్ని విభాగాల్లో రూ.40 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టి పోయారని, వాటిని తీర్చడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు.