- బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ కేటాయింపులు
- బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్, వెలుగు: బలహీన వర్గాల జీవన ప్రమాణాలు పెంచేలా బడ్జెట్ లో బీసీ సంక్షేమ శాఖ ప్రతిపాదనలు ఉండాలని అధికారులను ఆ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న పథకాలకు నిధుల విడుదల విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవని, లబ్ధిదారులకు సక్రమంగా పథకాలు అందేలా చూడాలని సూచించారు.
గురువారం మినిస్టర్ క్వార్టర్స్‌లో బీసీ సంక్షేమ శాఖ, రవాణా శాఖల బడ్జెట్ ప్రతిపాదనలపై అధికారులతో మంత్రి రివ్యూ చేపట్టారు. ‘విజన్–2047’ లక్ష్యాలకు అనుగుణంగా రెండు శాఖల బడ్జెట్ లు ఉండాలని పేర్కొన్నారు. విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, బీసీ హాస్టళ్ల నిర్వహణ, స్టడీ సర్కిళ్లలో శిక్షణ, స్కిల్ డెవలప్‌మెంట్ కార్యక్రమాలపై అధికారులతో చర్చించారు.
కల్యాణ లక్ష్మి పథకంతో పాటు రజక, నాయి బ్రాహ్మణులకు ఉచిత విద్యుత్ అమలు, గౌడన్నలకు కాటమయ్య కిట్ల పంపిణీ వంటి అంశాలపై సమీక్షించారు. త్వరలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క నిర్వహించబోయే బడ్జెట్ సన్నాహక సమావేశంలో ఈ అంశాలన్నింటిపై చర్చించాలని అధికారులను ఆదేశించారు. ‘విజన్– 2047’ లక్ష్యాలకు అనుగుణంగా రవాణా శాఖ, ఆర్టీసీలో కార్యాచరణ ఉండాలన్నారు. సొంత స్థలాలు ఉండి కార్యాలయాలు లేని చోట భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు.
