ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నం : మంత్రి పొన్నం ప్రభాకర్

ప్రభుత్వ బడులను బలోపేతం చేస్తున్నం :  మంత్రి పొన్నం ప్రభాకర్
  •    మంత్రి పొన్నం ప్రభాకర్​
  •     లోక్ భవన్ ప్రభుత్వ హైస్కూల్‌‌‌‌లో  బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం 

హైదరాబాద్ సిటీ, వెలుగు : ‘గ్రామీణ ప్రాంతాల్లో తల్లిదండ్రులు తమ పిల్లలను సర్కారు బడులకు పంపిస్తేనే ప్రభుత్వ పథకాలు వస్తయని చెప్తూ వారిని ప్రేరేపితం చేస్తున్నాం. చాలామంది ప్రభుత్వ స్కూల్స్, హాస్పిటల్ అంటే ఆసక్తి చూపించడం లేదు కానీ, ప్రభుత్వ నౌకరి,  పథకాలు మాత్రం కావాలంటున్నారు’ అని హైదరాబాద్​ఇన్​చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్​ అన్నారు. తమ ప్రభుత్వం సర్కారు బడులను బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉందని, ఎలాగైనా చేసి తీరతామని పేర్కొన్నారు. ఖైరతాబాద్​లోని లోక్​భవన్ మోడల్​స్కూల్​లో సోమవారం మంత్రి పొన్నం ప్రభాకర్ ఉచిత బ్రేక్​ఫాస్ట్​స్కీంను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్​తో కలిసి కూర్చుని వారికి బ్రేక్ ఫాస్ట్ వడ్డించి, తినిపించారు. తర్వాత ఫ్రీ బుక్స్, నోట్ బుక్స్‌‌‌‌ పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న 29 లక్షల మందికి ఈ స్కీం వర్తించనుందని స్పష్టం చేశారు. ప్రీ -ప్రైమరీ నుంచి ఇంటర్​వరకు ఈ స్కీం వర్తిస్తుందని చెప్పారు.  దీని కోసం ఏటా రూ. 720 కోట్లు ఖర్చు చేస్తన్నామన్నారు. బ్రేక్ ఫాస్ట్ కు రూ. 540 కోట్లు, పాలు/రాగి జావ పంపిణీకి రూ. 180 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 45 ప్రభుత్వ స్కూల్స్​లో పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసినట్లు తెలిపారు. 

తొలి విడతలోనే 12,437 మందికి లబ్ధి చేకూరుతుందని అన్నారు. ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘మన్నా ట్రస్ట్’ ఆధ్వర్యంలో ఈ స్కీం చేపట్టామని చెప్తూ, ఆ సంస్థ సీఈవో లీనా జోసెఫ్ ను అభినందించారు. సోమవారం నుంచే ప్రీ-ప్రైమరీ క్లాసులు కూడా స్టార్ట్​చేసినట్టు చెప్పారు. విద్యార్థులు పేరెంట్స్​ను ఇబ్బంది పెట్టకుండా ఉదయాన్నే సిద్ధమై బడికి వచ్చి ఇక్కడే టిఫిన్​, మధ్యాహ్నం భోజనం చేయాలన్నారు. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, యశస్విని రెడ్డి, కలెక్టర్ ప్రియాంక ఆల, డీఈవో యాదయ్య, ఆర్డీవో సాయిరాం, లోక్  భవన్ స్కూల్ ప్రిన్సిపాల్ శామ్యూల్ రాజు, పుష్పలత, ఇన్​చార్జి హెచ్ఎం గోపాల్ పాల్గొన్నారు.