- ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నం: మంత్రి పొన్నం
- పదేండ్లలో అమరవీరుల కోసం బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలి
- మండలిలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యలపై ఫైర్
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ అమరవీరుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి కుటుంబాలకు సముచిత న్యాయం చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. శాసన మండలిలో అమరవీరుల అంశంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందించారు.
పదేండ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం అమరవీరుల పట్ల, ఉద్యమకారుల పట్ల చూపిన చిత్తశుద్ధి ఏంటో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో తాను, ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ తదితరులతో కూడిన బృందం ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా పనిచేస్తున్నామని మంత్రి తెలిపారు. ‘‘మమ్మల్ని ప్రశ్నించే ముందు పదేండ్లు మీరు ఏం చేశారో సమాధానం చెప్పాలి. అమరవీరుల కుటుంబ సభ్యులే మిమ్మల్ని విమర్శిస్తున్నారు.
అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ గీతాన్ని, తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు చట్టబద్ధంగా గుర్తించలేదు?’’ అని పొన్నం నిలదీశారు. తెలంగాణ తల్లి విగ్రహంపై దాసోజు శ్రవణ్ చేసిన విమర్శలకు స్పందిస్తూ.. గ్రామీణ మహిళా రూపం ప్రతిబింబించేలా అందరినీ సంప్రదించి కొత్త విగ్రహాన్ని రూపొందించామని మంత్రి చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న విగ్రహం ఆ పార్టీ పేటెంట్ లాగా ఉండేదని, తాము చేసిన విగ్రహాన్ని గౌరవపూర్వకంగా సెక్రటేరియెట్ మధ్యలో ప్రతిష్టించుకున్నామని పేర్కొన్నారు. బతుకమ్మ పండుగను కూడా బీఆర్ఎస్ సొంత ఆస్తిలాగా మాట్లాడుతోందని మండిపడ్డారు.
గవర్నర్ స్పీచ్ లో.. అమరుల ప్రస్తావన లేదు: దాసోజు శ్రవణ్
గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అమరవీరుల ప్రస్తావన లేకపోవడాన్ని దాసోజు శ్రవణ్ తప్పుబట్టారు. అమరవీరుల కుటుంబాలకు ఇచ్చిన ఉద్యోగ, పెన్షన్ హామీలను సర్కార్ విస్మరించిందని మండిపడ్డారు. ప్రభుత్వం చెబుతున్న 67వేల ఉద్యోగాల లెక్కల్లో వాస్తవానికి కొత్తవి కేవలం 17,513 మాత్రమేనని తెలిపారు. మేడిగడ్డ బ్యారేజీకి మరమ్మతులు చేయకుండా కేసీఆర్ మీద కక్షతో కాళేశ్వరాన్ని నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలపై శ్వేతపత్రం, ఓపీఎస్ అమలు, మూసీ బాధితులకు పూర్తి పరిహారం, ఎమ్మెల్యేలందరికీ డ్రగ్ టెస్టులు వంటి పలు డిమాండ్లను బీఆర్ఎస్ తరపున దాసోజు శ్రవణ్ ప్రభుత్వం ముందు ఉంచారు.
విపక్షాలు కళ్లు లేని కబోదులు: బల్మూర్ వెంకట్
అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా ప్రభుత్వం పనిచేస్తుంటే విపక్షాలకు కనిపించడం లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. ఆరు గ్యారంటీలలో ఐదు అమలు చేస్తున్నా ప్రతిపక్షాలు కావాలనే విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు ఇప్పటికే ఎన్నికల్లో వారికి సరైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు.
కేంద్ర నిధులపై పోరాడాలి: నెల్లికంటి సత్యం
గవర్నర్ ప్రసంగం రాష్ట్ర లక్ష్యాలను వివరించినప్పటికీ కేంద్ర వివక్షను ప్రస్తావించకపోవడంపై ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అసంతృప్తి వ్యక్తం చేశారు. విభజన చట్టం హామీలు, రాష్ట్రానికి రావాల్సిన రూ. 22వేల కోట్ల నిధులపై ప్రభుత్వం పోరాడాలని సూచించారు. రుణమాఫీ ఇంకా అందరికీ అందలేదని, నిరుద్యోగుల కోసం ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ స్క్రిప్ట్ రెడీ చేస్తే... గవర్నర్ చదివారు: ఏవీఎన్ రెడ్డి
అధికార పార్టీ తయారు చేసిన స్క్రిప్ట్ నే గవర్నర్ చదివారని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీన్ రెడ్డి విమర్శించారు. గవర్నర్ కు రాజ్యంగ బద్ధంగా వ్యవహరించి ఉంటే.. ప్రభుత్వ ఇచ్చిన స్క్రిప్ట్ చదివి ఉండేవారు కాదని పేర్కొన్నారు. అధికార పక్షం సభ్యులు చేసింది మాత్రమే చెప్పారని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఎన్నీ అమలు చేశారనే విషయం గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ప్రజల ఆర్థిక స్థితులు పెరిగాయని ప్రభుత్వం చెబుతున్నదని.. కానీ, పేదలు, ఉన్నవాళ్ల మధ్య అంతరాలు పెగుతున్నాయని అన్నారు.
అధికారికంగా ప్రకటించి ఉంటే చర్చే ఉండేది కాదు: చైర్మన్ గుత్తా
తెలంగాణ తల్లి విగ్రహంపై జరుగుతున్న చర్చపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. గత ప్రభుత్వం తెలంగాణ తల్లి విగ్రహాన్ని అధికారికంగా ప్రకటించి ఉంటే ఇప్పుడు ఈ చర్చకు ఆస్కారమే ఉండేది కాదన్నారు. ప్రస్తుత ప్రభుత్వం విగ్రహాన్ని రూపొందించి అధికారికంగా ప్రకటించిందని, పాత విషయాలపై చర్చ అవసరం లేదని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు పూజించుకోవచ్చని స్పష్టం చేశారు. అనంతరం మండలి బుధవారానికి వాయిదా పడింది.
