త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు: పొన్నం

త్వరలో 1000 ఎలక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు: పొన్నం

ఆర్టీసీ కార్మికులు, సంస్థను ఆదుకుంటామన్నారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్.  కార్మికులు, ప్రయాణికులు, ఆర్టీసీ సంస్థ పరిరక్షణ మా ప్రధాన బాధ్యత..  గత ప్రభుత్వ తప్పులు.. బకాయిలను సరి చేస్తామని చెప్పారు. డిసెంబర్ 30వ తేదీ శనివారం ఉదయం ఎన్టీఆర్ మార్గ్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద జెండా ఊపి 80 కొత్త ఆర్టీసీ బస్సులను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
ఆర్టీసీలో 1050 కొత్త బస్సులు ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఈరోజు 80 బస్సులు లాంచ్ చేశామని.. త్వరలో 1000 ఎలెక్ట్రిక్ బస్సులను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు.   

ఆర్టీసీ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తున్నారని..  వారి కృషి వల్లే సంస్థ ఎదుగుతుందని చెప్పారు.  సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉచిత పథకాన్ని  ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో ప్రారంభించామని తెలిపారు. ఇప్పటి వరకు 6 కోట్ల మంది మహిళలు ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారని.. మహిళల నుంచి ఎంత మంచి స్పందన ఉందో అర్థం అవుతుందన్నారు.   40--50 ఉండే ఆక్యుపెన్సీ ఇప్పుడు 100 దాటి పోతోందన్నారు.  మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలుకు అధికారులు కృషి చేయాలని కోరారు మంత్రి పొన్నం. 

రూ.400 కోట్ల వ్యయంతో అధునాతన బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని చెప్పారు.  364 బస్టాండ్లలో వసతులు మెరుగు పరుస్తామని చెప్పారు. ప్రభుత్వ నిర్ణయాలను బాధ్యతగా అమలు చేయాలని ఆర్టీసీ అధికారులు పనిచేయాలన్నారు.  తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికుల కృషి మరువలేనిదని.. ఉద్యమకారుడిగా, ఎంపీగా తనకు తెలుసన్నారు. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర సాధనకు కార్మికులు కష్టపడ్డారని.. ఆర్టీసీది మర్చిపోలేని కృషి ఉందన్నారు. ఆర్టీసీ సంక్షేమ, పరిరక్షణకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.