
- అందుకు నిదర్శనం పొన్నం కుటుంబం
- పొన్నం సత్తయ్య జీవన సాఫల్యం అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రులు తుమ్మల, జూపల్లి, శ్రీధర్ బాబు వ్యాఖ్య
- అంపశయ్య నవీన్, రమాదేవికి పురస్కారాలు ప్రదానం
బషీర్బాగ్, వెలుగు: భూమిపుత్రుడు పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారం కవులు, కళాకారులకు ఇవ్వడం అభినందనీయమని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తండ్రి పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కార కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షత వహించగా... సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో కలిసి మంత్రి తుమ్మల పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్, కళా రంగంలో ప్రముఖ జానపద గాయని అంతడుపుల రమాదేవికి పొన్నం సత్తయ్య జీవన సాఫల్య పురస్కారాన్ని మంత్రులు అందజేశారు. అవార్డు గ్రహీతలకు రూ.51 వేల నగదు, మెమెంటో జ్ఞాపికలను అందజేసి సన్మానించారు. అనంతరం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ... ఉమ్మడి కుటుంబాల వ్యవస్థను కాపాడుకోవాలన్నారు. పొన్నం సత్తయ్య భూమిని నమ్ముకొని పిల్లలను ప్రయోజకులను చేశారని కొనియాడారు. అలాగే, పొన్నం ప్రభాకర్ చిన్న వయసులోనే రాజకీయాల్లోకి వచ్చి ఈరోజు మంత్రి అయ్యారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అధికార పార్టీ ఎంపీగా ఉండి అధిష్టానాన్ని ధిక్కరించి ఉద్యమం చేశారని గుర్తు చేశారు.
బీసీ మంత్రిగా రిజర్వేషన్లు బిల్లు పెట్టే అదృష్టం పొన్నంకు దక్కిందన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ... గతంలో కరీంనగర్ ఇన్ చార్జి మంత్రిగా ఉన్నప్పుడు పొన్నం సత్తయ్యను కలిసే అవకాశం వచ్చిందన్నారు. పొన్నం ప్రభాకర్ తండ్రిని మించిన తనయుడిగా నిలిచారన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడానికి పోరాడుతున్నారని పేర్కొన్నారు. ఉమ్మడి కుటుంబం సమాజానికి ఆదర్శంగా ఉంటుందని, పొన్నం కుటుంబం అందుకు నిదర్శనం అన్నారు. మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ... పొన్నం సత్తయ్య కుమారులు రైతు కుటుంబం నుంచివచ్చి తెలంగాణ ప్రాంతంలో నైపుణ్యం ఉన్న అనేక మందిని గుర్తించి వారికి పురస్కారం అందిస్తున్నారని కొనియాడారు. పొన్నం సత్తయ్య దూరమై 15 ఏండ్లు గడుస్తున్నా.. వారిని స్మరించుకుంటు కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు.