పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే : బండి సంజయ్

 పొన్నం వ్యాఖ్యలు కోర్టు ధిక్కరణే : బండి సంజయ్

కరీంనగర్, వెలుగు : ‘20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్​లో ఉన్నారని, ఏడాదిలోపే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పడిపోతుందని కేసీఆర్ అంటుంటే...25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్​తో టచ్​లో ఉన్నారని సీఎం అంటున్నారు. ఇద్దరు కలిసి ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తున్నారు’ అని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ విమర్శించారు.  హుస్నాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్​కు చెందిన పలువురు తాజా మాజీ సర్పంచులతోపాటు ఆ పార్టీ నేతలు బండి సంజయ్ సమక్షంలో శుక్రవారం బీజేపీలో చేరారు. 

ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు క్వింటాల్​వడ్లకు రూ.500 చొప్పున బోనస్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఈ లెక్కన ఒక్క ఎకరానికి సగటున 28 క్వింటాళ్ల వడ్లకు రూ.14 వేల చొప్పున బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఎన్నికల తర్వాత రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానంటే నమ్మేదెవరని ప్రశ్నించారు.  

బీజేపీకి రూ.500 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు ఇస్తే లిక్కర్ స్కాం నిందితుడు శరత్ చంద్రారెడ్డికి కోర్టు బెయిల్ ఇచ్చిందంటూ మంత్రి పొన్నం చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా..గౌరవ న్యాయ స్థానాలపై కూడా అభాండాలు మోపడం నీచమని, ఇది ముమ్మాటికీ కోర్టు ఉల్లంఘనే అన్నారు. కోర్టుకు అవినీతిని ఆపాదించడం క్షమించరాని నేరమన్నారు. దీనిపై పార్టీ నాయకత్వంతో చర్చించి న్యాయపరమైన పోరాటం చేస్తామని హెచ్చరించారు.