
- రామాయంపేటలో తాళాలు పగులకొట్టి ప్రవేశం
- ఖాళీ చేయించిన రెవెన్యూ, పోలీస్ ఆఫీసర్లు
రామాయంపేట, వెలుగు : మెదక్ జిల్లా రామాయంపేటలో నిర్మాణం పూర్తయినా పంపిణీ చేయని డబుల్ బెడ్రూం ఇండ్లను గురువారం పలువురు పేదలు స్వాధీనం చేసుకున్నారు. అయితే, రెవెన్యూ, పోలీస్ అధికారులు వారిని అందులోంచి ఖాళీ చేయించారు. గత బీఆర్ఎస్ప్రభుత్వ హయాంలో పట్టణ శివారులో పేదల కోసం 304 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. ఇందులో 250 ఇండ్లను గత ఏడాదే అర్హులకు కేటాయించారు. మిగతా 54 ఇండ్లు ఎవరికీ ఇవ్వకపోవడంతో ఖాళీగా ఉన్నాయి.
దీంతో గురువారం కొంతమంది పేదలు అక్కడకు వచ్చి రాళ్లతో తాళాలు పగలగొట్టి ఇండ్లలోకి ప్రవేశించారు. విషయం తెలుసుకున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజు అక్కడకు చేరుకుని నచ్చజెప్పారు. అయినా వారు వినకపోవడంతో తహసీల్దార్ రజిని, సీఐ వెంకట రాజాగౌడ్, ఎస్ఐ రంజిత్ సిబ్బందితో అక్కడికి చేరుకుని బలవంతంగా ఇండ్లలోకి ప్రవేశిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అర్హులైన వారు ఇండ్ల కోసం అధికారులకు దరఖాస్తు చేసుకుని కేటాయించిన తర్వాతే లోపలకు రావాలన్నారు. దీంతో వారు ఇండ్లలో నుంచి వెళ్లిపోయారు.