SIR పేరుతో పేదల హక్కులు గుంజుకునే కుట్ర..తొలుత ఓటును. ఆ తర్వాత ఆధార్‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌కార్డులు తీసేస్తరు

SIR పేరుతో పేదల హక్కులు గుంజుకునే కుట్ర..తొలుత ఓటును. ఆ తర్వాత ఆధార్‌‌‌‌‌‌‌‌, రేషన్‌‌‌‌కార్డులు తీసేస్తరు
  • రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నది
  • రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు  ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారు
  • నాడు గాంధీ, అంబేద్కర్‌‌‌‌‌‌‌‌లాగా నేడు రాహుల్, ఖర్గే  పోరాడుతున్నరు
  • ఓట్‌‌‌‌చోరీ వ్యతిరేక పోరుకు తెలంగాణ ​అండగా ఉంటుందని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: కేంద్రంలోని బీజేపీ సర్కారు ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌‌‌‌) పేరుతో తొలుత దేశంలోని దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదల  ఓటరు కార్డులను తొలగిస్తుందని సీఎం రేవంత్‌‌రెడ్డి అన్నారు. ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులను రద్దు చేస్తారని.. అనంతరం వాళ్లకున్న హక్కులన్నీ గుంజుకుంటారని ఆరోపించారు.

 ఈ సమస్య ఎన్నికలదో.. కాంగ్రెస్ పార్టీదో కాదని, ఇది దేశ సమస్య అని తెలిపారు. ఈ సమస్యకు వ్యతిరేకంగా కాంగ్రెస్​ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే పోరాడుతున్నారని చెప్పారు. ఈ పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉన్నదని, దేశ ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు.  ఆదివారం ఢిల్లీలోని రామ్‌‌లీలా మైదానంలో ‘ఓట్‌‌ చోర్‌‌- గద్దీ చోడ్‌‌’ పేరుతో కాంగ్రెస్‌‌ పార్టీ మహా ధర్నా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ఏఐసీసీ చీఫ్‌‌ మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు రాహుల్‌‌గాంధీ, ప్రియాంక గాంధీతోపాటు పలువురు ముఖ్య నేతలు హాజరయ్యారు. తెలంగాణ నుంచి ధర్నాలో రేవంత్‌‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ పోరాటంలో రాహుల్‌‌ గాంధీకి మనమంతా అండగా ఉండాలి. రాహుల్‌‌ను దేశ ప్రజలు గెలిపించాలి. లేదంటే బీజేపీ  ఓటు హక్కును లాక్కుంటది. 

ఒకసారి ఓటరు లిస్టు నుంచి పేరు పోయిన తర్వాత.. ఆధార్‌‌ కార్డు, రేషన్‌‌ కార్డు, భూమి, ఆస్తులు కూడా గుంజుకుంటారు. మూలవాసీలు, ఆదివాసీలు అన్నీ కోల్పోతారు. రాహుల్‌‌గాంధీ సిపాయిగా మారి మోదీకి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మీరంతా ఆయన వెంట నడిచేందుకు సిద్ధంగా ఉండాలి” అని వ్యాఖ్యానించారు. 

రాజ్యాంగాన్ని కాపాడుకుందాం..

రాజ్యాంగాన్ని రద్దు చేయాలని బీజేపీ చూస్తున్నదని, దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని ముఖ్యమంత్రి రేవంత్‌‌ రెడ్డి అన్నారు. ‘‘రాజ్యాంగ రచన సమయంలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయమై మహాత్మా గాంధీ, అంబేద్కర్‌‌‌‌ రాజ్యాంగ సభలో  చర్చిస్తున్నప్పుడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎం.ఎస్‌‌ గోల్వాల్కర్‌‌ తదితరులు వారికి ఓటు హక్కు ఇవ్వొద్దన్నారు.

 కానీ.. మహాత్మా గాంధీ, అంబేద్కర్‌‌‌‌ వారికి ఓటు హక్కు కల్పించారు”అని రేవంత్​ రెడ్డి చెప్పారు. అందువల్లే ఈ దేశంలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలు కూడా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వాములవుతున్నారని ఆయన వివరించారు. ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ, అమిత్ షా కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలు చేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకున్నారని అన్నారు. 

కానీ, బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు ఆ పార్టీని 240 సీట్లకు పరిమితం చేశారని గుర్తుచేశారు. అలా చేయడంవల్లే ఇవ్వాళ రాజ్యాంగం,  రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. అందుకే ఇప్పుడు సర్ పేరుతో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు  ఓట్లు తొలగించే పనిలోపడ్డారని ఆరోపించారు. 

నాడు పేదలు, దళితులు, ఆదివాసీలు, మైనారిటీల కోసం గాంధీ, అంబేద్కర్‌‌‌‌ నిలబడినట్లే.. ఇప్పుడు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నిలుస్తున్నారని చెప్పారు. దేశ ప్రజలంతా వారి వెంట నడిచేందుకు సిద్ధం కావాల ని పిలుపునిచ్చారు.