
ప్రముఖ తమిళ నటుడు డేనియల్ బాలాజీ (48) గుండెపోటుతో కన్నుమూశారు. ఛాతీలో నొప్పితో చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన ఆయన, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మరణం పట్ల పలువురు సినీ సెలబ్రిటీస్ సంతాపం తెలియజేశారు. ‘పిన్ని’ సీరియల్‌లో పోషించిన డేనియల్ పాత్ర ఆయనకు ఇంటిపేరుగా మారింది. ఆ తర్వాత వడ చెన్నై, కాక్క కాక్క, వేట్టైయాడు విళయాడు, రాఘవన్ చిత్రాలతో మంచి గుర్తింపును అందుకున్నారు.
ఘర్షణ, సాంబ, చిరుత, సాహసం శ్వాసగా సాగిపో, టక్ జగదీష్ లాంటి తెలుగు చిత్రాల్లో నటించారు. ‘రాఘవన్’ చిత్రంలో విలన్‌గా బాలాజీ నటన తమిళ, తెలుగు ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో ఆయన నటించారు. తెరపై విలన్‌గా నటించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం హీరో అనిపించుకున్నారు. మరణానంతరం కళ్లను దానం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. అలాగే తన పారితోషికాన్ని తన ఇంటి దగ్గరలోని దేవాలయ అభివృధ్దికి ఆయన ఖర్చు చేశారు.