
ఎల్ బీ నగర్, వెలుగు: అశ్లీల వెబ్ సైట్ లో అత్త ఫోన్ నంబర్ పెట్టిన అల్లుడిని రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా కమలాపూర్ కు చెందిన దుబసి సునీల్(33), వైజాగ్‌లోని పరవాడ ఎన్టీపీసీ డిప్యూటీ మేనేజర్. ఇతనికి తన భార్య, అత్తతో కొంతకాలంగా కుటుంబ కలహాలు ఉన్నాయి. దీంతో అత్తపై పగ పెంచుకొని ఆమె ఫోన్ నంబర్ ను కొద్ది రోజుల కిందట అశ్లీల వెబ్ సైట్ లో పెట్టాడు. అప్పటి నుంచి ఆమెకు గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారు.
ఫోన్ లు వస్తుండటంతో విసిగిపోయిన ఆమె రాచకొండ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేయగా అల్లుడే నిందితుడు అని తేలింది. అతడిని అరెస్ట్ చేయగా కుటుంబ కలహాలతో పగ పెంచుకున్నానని పబ్లిక్ లో వారిని బ్లేమ్ చేసేందుకే ఇలా చేసినట్లు విచారణలో సునీల్ ఒప్పుకున్నాడు. అతడిని రిమాండ్ కు తరలించారు.