ఇంజినీరింగ్​లో 25% ఫీజుల పెంపు!

ఇంజినీరింగ్​లో 25% ఫీజుల పెంపు!
  •     శ్రీకృష్ణ కమిటీ సిఫారసు మేరకు ఫీజుల పెంపు కుదరదు
  •     కాలేజీ మేనేజ్ మెంట్లతో టీఏఎఫ్ఆర్సీ

హైదరాబాద్,వెలుగు: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ తదితర కోర్సుల్లో గరిష్టంగా 25 శాతం వరకు ఫీజలు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం కాలేజీల్లో వసూలు చేస్తున్న ఫీజుల కంటే తక్కువ ఖర్చు చేసినా, ఫీజులు మాత్రం తగ్గే అవకాశం లేనట్టు తెలిసింది. అలాంటి కాలేజీలకు పాత ఫీజులనే కొనసాగించే ఆలోచనలో సర్కార్ ఉన్నట్లు సమాచారం. జేఎన్ఏఎఫ్ఏయూలో తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీజు రెగ్యులేటరీ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) చైర్మన్ జస్టిస్ స్వరూప్​రెడ్డి, కమిటీ అధికారి రామారావు శనివారం ప్రైవేటు కాలేజీల మేనేజ్ మెంట్ లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు రాబోయే మూడేండ్లకు ఫీజులు పెంచాలని, కనీస ఫీజు రూ. 50 వేల కంటే ఎక్కువగా నిర్ణయించాలని మేనేజ్ మెంట్లు కోరాయి. అయితే శ్రీకృష్ణ కమిటీ సిఫారసుల మేరకు ఫీజులను పెంచలేమని, కేవలం 2018–19, 2019–20 అకడమిక్ ఇయర్లలో కాలేజీల ఆదాయ, వ్యయాలకు అనుగుణంగానే పెంపు ప్రతిపాదనలు చేస్తామని టీఏఎఫ్ఆర్సీ స్పష్టం చేసింది. మే చివరి వారం లేదా జూన్ ఫస్ట్​ వీక్​లో ఒక్కో కాలేజీతో ప్రత్యేకంగా భేటీ అవుతామని, అప్పుడు నిర్ణయించిన ఫీజులను సర్కారుకు పంపిస్తామని అధికారులు యాజమాన్యాలకు చెప్పినట్లు తెలిసింది. భారీగా ఫీజుల పెంపు ఉండబోదని, గరిష్టంగా 25 శాతం మాత్రం పెరగొచ్చని సూచనప్రాయంగా తెలిపింది. శ్రీకృష్ణ కమిటీ 7వ పీఆర్సీ ప్రతిపాదనలు తీసుకుని ఫీజులు ప్రతిపాదించాయని, రాష్ట్రంలో ఈ కమిటీ సిఫారసుల మేరకు కాలేజీలు తమ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వడం లేదని టీఏఎఫ్ఆర్సీ అన్నట్లు సమాచారం.