హైదరాబాద్: బండి భగీరథ్ పరారీలో ఉన్నాడని హైదరాబాద్లో పోస్టర్ల కలకలం రేపాయి. శేరిలింగంపల్లిలో మెయిన్ రోడ్డు పక్కన ఈ పోస్టర్లు కనిపించాయి. గచ్చిబౌలి ఫ్లైఓవర్ ,నలగండ్ల ఫ్లైఓవర్ ,శేరిలింగంపల్లి జోనల్ ఆఫీసర్ ఆఫీస్ వద్ద ఈ పోస్టర్లను అతికించారు. ఈ పోస్టర్లను ఎవరు అతికించారనే విషయంలో స్పష్టత లేదు. లైంగిక వేధింపుల కేసులో నిందితుడైన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ పరారీలో ఉన్నాడని పేర్కొంటూ.. శేరిలింగంపల్లిలోని పలు ప్రాంతాలలో పోస్టర్లు కనిపించడంతో స్థానిక బీజేపీ నేతలు ఈ పరిణామంపై మండిపడ్డారు.
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై ఈ నెల 8న నమోదైన పోక్సో కేసు కీలక మలుపు తిరిగిన సంగతి తెలిసిందే. బాధితురాలి స్టేట్‌మెంట్ ఆధారంగా రేప్ కేసుకు సంబంధించి పోక్సో యాక్ట్‌లోని 5(1) రెడ్‌విత్ 6 సెక్షన్లనూ FIRలో చేర్చారు. ఈ నెల 8న బాధిరాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బీఎన్‌ఎస్ 74,75తో పాటు మైనర్‌పై లైంగిక వేధింపులకు సంబంధించి పోక్సో చట్టంలోని 11 రెడ్ విత్ 12 సెక్షన్ల కింద పేట్ బషీరాబాద్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్న ఈ కేసు తీవ్రత నేపథ్యంలో కూకట్‌పల్లి డీసీపీ రితిరాజ్ మంగళవారం మరోసారి బాధితురాలి వద్దకు వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్న అంశాలతోపాటు బాధితురాలు తెలిపిన వివరాల ఆధారంగా సమాచారం సేకరించారు.
భగీరథ్‌ను తీసుకురావాలని మేనమామకు నోటీసులు
దర్యాప్తులో భాగంగా బాధితురాలితో పోలీసులు మాట్లా డారు.ఈ క్రమంలోనే బాధితురాలిపై లైంగిక దాడి కూడా జరిగినట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఈ మేరకు మైనర్‌పై లైంగిక దాడికి సంబంధించి 5(1) రెడ్‌విత్ 6 పోక్సో సెక్షన్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. నిందితుడు భగీరథ్‌కు నోటీసులు జారీ చేసేందుకు పేట్‌బషీరాబాద్ పోలీసులు కరీంనగర్ వెళ్లారు.
కాల్ డేటా ఆధారంగా భగీరథ్ మామ ఇంటికి వెళ్లారు. భగీరథ్ అందుబాటులో లేకపోవడంతో.. ఆయన మేనమామ వంశీకృష్ణకు నోటీసులు అందించారు. దర్యాప్తులో భాగంగా నిందితుడు భగీరథ్‌తో కలిసి బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తమ ముందు హాజరుకావాలని ఆదేశించారు. హాజరుకాని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నేరం రుజువైతే 20 ఏండ్లు శిక్ష, లేదా జీవిత ఖైదు
గతంలో నమోదు చేసిన బీఎన్‌ఎస్ 74, 75, పోక్సో చట్టంలోని సెక్షన్ 11,12 ప్రకారం.. నేరం రుజువైతే కోర్టులు మూడేండ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తాయి. బెయిల్ కూడా లభించే అవకాశాలున్నాయి. కాగా, ప్రస్తుతం చేర్చిన 5(1), 6 పోక్సో సెక్షన్ల ప్రకారం.. బెయిల్ లభించకపోగా నేరం రుజువైతే 20 ఏండ్ల వరకు జైలు శిక్ష, తీవ్రతను బట్టి జీవిత ఖైదు విధించే అవకాశాలున్నాయి. దీంతో నిందితుడు బండి భగీరథ్‌ను అరెస్ట్ అనివార్యంగా మారింది.
