కొట్టుకుపోయిన పోతిరెడ్డిపాడు గేట్..శ్రీశైలం నుంచి ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు

కొట్టుకుపోయిన పోతిరెడ్డిపాడు గేట్..శ్రీశైలం నుంచి ఏపీ ప్రాజెక్టులకు నీళ్లు
  •  నీటిని వదిలే సమయంలో రోప్ తెగిపోయిందన్న ఏపీ
  • ప్రవాహ ఉధృతికి కొట్టుకుపోయిన 9వ నంబర్ గేట్
  • విషయం బయటికి పొక్కకుండ ఆఫీసర్లు సైలెంట్
  • రిపేరు చేయకుంటే శ్రీశైలంలో మిగిలేది 100 టీఎంసీలే

మహబూబ్ నగర్, వెలుగు : ఏపీ నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు వద్ద ప్రమాదం చోటుచేసుకుంది. దిగువకు నీరు విడుదల చేస్తున్న సమయంలో ఒక గేటుకు సంబంధించిన రోప్ తెగిపోవడంతో గేటు బకెట్ ఊడిపోయింది. దీంతో శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి నీరు వృథాగా పోతున్నది. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నంద్యాల జిల్లాలో పోతిరెడ్డి ప్రాజెక్టును ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద 11 గేట్లు ఉండగా, వరద ఉధృతి ఆధారంగా  రెండు, మూడు, నాలుగు, ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది గేట్ల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

ఇటీవల శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రావడంతో రోజూ 8000 క్యూసెక్కుల నుంచి పది వేల క్యూసెక్కుల వరకు నీటిని వదులుతున్నారు. గురువారం కూడా ఆ ప్రాజెక్టు నుంచి ఎనిమిది వేల క్యూసెక్కులను తాగు అవసరాల కోసం తెలుగు గంగ ప్రాజెక్టు, కే సి కెనాల్ కు వదిలారు. ఆ సమయంలో సాయంత్రం 9వ గేటును ఎత్తుతుండగా ఆ గేటుకు సంబంధించిన రోప్ తెగిపోయింది.  ఆ సమయంలో గేటు బకెట్ కూడా నీళ్లలో పడి కొట్టుకుపోవడంతో బ్యాక్ వాటర్ నుంచి భారీగా నీరు ఏపీకి తరలిపోతున్నది.  శ్రీశైలం బ్యాక్ వాటర్ ఈ పేరుతో తరిగిపోతుండటం గమనార్హం.  ఈ ఘటనకు సంబంధించి అక్కడి ఆఫీసర్లు ఇలాంటి సమాచారాన్ని బయటకు రానివ్వడం లేదు.  

దిగువ ప్రాజెక్టులకు నీళ్లు

ఎల్ నినో ఎఫెక్ట్ కారణంగా ఈ ఏడాది ప్రాజెక్టులకు వరద నమోదు కాలేదు. జూన్ మొదటి వారం నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరదలు రావాల్సి ఉండగా తీవ్ర ఆలస్యమైంది. జూలై చివరివారం నుంచి ఆగస్టు మధ్య వరకు కర్ణాటక నుంచి వచ్చిన వరద నీటితో శ్రీశైలం ప్రాజెక్టుకు జూరాల నుంచి దాదాపు 180 టీఎంసీలు చేరింది.  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా నిర్మించిన లిఫ్టులతో కొద్ది రోజులుగా నీటిని తరలించుకు పోతున్నది. తాజాగా పోతిరెడ్డిపాడు గేటు కొట్టుకుపోవడంతో ఆ గేటు గుండా పెద్ద మొత్తంలో నీరు దిగువన ఏపీలో ఉన్నప్రాజెక్టులకు తరలిపోతున్నది. శ్రీశైలం ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 215.7 టీఎంసీలు కాగా ప్రస్తుతం 127 టీఎంసీలే నిల్వ ఉన్నది. గేటును బిగించి నీటిని ఒడిసి పట్టకపోతే ఒకటి, రెండు రోజుల్లో ప్రాజెక్టు కేవలం 100 టీఎంసీలే ఉండే అవకాశం ఉంది. 

ఇప్పుడే ఎందుకెత్తారు..?

శ్రీశైలంలో ప్రాజెక్టులో 200 టీఎంసీలకుపైగా నీళ్లు ఉన్నప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు 9, 10, 11 గేట్లను ఆపరేట్ చేస్తుంటారు. ఇప్పుడు ప్రాజెక్టులో కేవలం 127 టీసీఎంల నీళ్లున్నాయి. ఈ సమయంలో ఆ గేటును ఎందుకు ఆపరేట్ చేశారన్నది అనుమానాలకు తావిస్తోంది. గేటు కొట్టుకు పోవడంలో పొరుగు రాష్ట్రం కుట్ర కోణాన్ని కూడా కొట్టిపారేయ్యలేమన్న అభిప్రాయాలూ నీటిపారుదలరంగ నిపుణుల నుంచి వ్యక్తమవుతున్నాయి. గేట్ కొట్టుకుపోవడం కృష్ణా నీళ్లను మళ్లించుకునేందుకు ఏపీ వేసిన ఎత్తుగడలో భాగమేనా..? అన్న చర్చ కూడా మొదలైంది.