V6 News

బీఆర్ఎస్‌‌కు ఇక అధికారం కలే : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్గౌడ్‌‌

బీఆర్ఎస్‌‌కు ఇక అధికారం కలే : పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్గౌడ్‌‌
  •     ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తులేదు: మహేశ్‌‌గౌడ్​
  •     బీఆర్ఎస్ నేతల దోపిడీని కవితనే బయటపెడ్తున్నది
  •     ఈ నెలాఖరులోపు నామినేటెడ్, పార్టీ పదవులు భర్తీ చేస్తామని వెల్లడి 

హైదరాబాద్, వెలుగు:   బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రం అన్ని విధాల విధ్వంసానికి గురైందని, ఇక ఆ పార్టీకి అధికారం కలేనని పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌కుమార్​గౌడ్‌‌  అన్నారు. ఆ పార్టీకి గతం తప్ప భవిష్యత్తు లేదని విమర్శించారు. లావాదేవీల్లో వచ్చిన తేడాల వల్లే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల దోపిడీలను ఎమ్మెల్సీ కవిత వరుసగా బయటపెడుతున్నారని  అన్నారు. ఆమె చేస్తున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని  సీఎం రేవంత్‌‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం సీఎల్పీలో  మహేశ్‌‌గౌడ్​ మీడియాతో చిట్ చాట్ చేశారు. పదేండ్ల బీఆర్‌‌‌‌ఎస్  పాలన కంటే రెండేండ్ల ప్రజా పాలనలోనే నాలుగింతల అభివృద్ధి, సంక్షేమం అమలవుతున్నాయని చెప్పారు. 

కాంగ్రెస్‌‌దే అధికారం..

వచ్చే ఎన్నికల్లో కూడా  రాష్ట్రంలో  కాంగ్రెస్ దే అధికారం అని, సీఎం దూరదృష్టికి గ్లోబల్ సమిట్ నిదర్శనమని మహేశ్‌‌కుమార్​గౌడ్​ పేర్కొన్నారు. గ్లోబల్ సమిట్ సక్సెస్ చూసి హరీశ్‌‌రావులో గుబులు మొదలైందని అన్నారు. అన్ని రంగాలకు ఫ్యూచర్ సిటీ హబ్‌‌గా నిలవనుందని చెప్పారు. 
తెలంగాణ భవిష్యత్తుకు గ్లోబల్ సమిట్ సరికొత్త  దశ అని తెలిపారు. 

రాబోయే రోజుల్లో తెలంగాణలో కాంగ్రెస్ తరఫున బీసీయే సీఎం అవుతారని, అది బీసీల ఆకాంక్ష కూడా అని పేర్కొన్నారు. తాను పీసీసీ చీఫ్‌‌గా పూర్తి సంతృప్తితోనే ఉన్నానని, ఈ నెలాఖరులోపు నామినేటెడ్ పదవులు, పార్టీ పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. త్వరలోనే వర్కింగ్ ప్రెసిడెంట్లు, పీసీసీ ప్రచార  కమిటీని నియమిస్తామని వెల్లడించారు.  

సీఎంతో తనకు కొంత విభేదాలు ఉన్నాయనేది పూర్తిగా అసత్యమని, అది తప్పుడు ప్రచారం మాత్రమేనని స్పష్టం చేశారు.  ఓయూ ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కడంతో  సీఎం రేవంత్‌‌రెడ్డి కొత్త చరిత్ర  సృష్టించారని,  60 ఏండ్లలో ఆర్ట్స్ కాలేజీ మెట్లు ఎక్కిన చరిత్ర రేవంత్‌‌కే దక్కుతుందని అన్నారు.