- గాలిదుమారం కారణంగా విరిగిన స్తంభం, తెగిన వైర్లు
కాశీబుగ్గ/వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌కు గురువారం విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున ఒక్కసారిగా గాలి దుమారం రావడంతో హాస్పిటల్‌లోని విద్యుత్ స్తంభం కూలిపోవడంతో పాటు వైర్లన్నీ తెగిపోయాయి. దీంతో ఔట్ పేషెంట్ విభాగాలైన మెడికల్, సర్జికల్, చెవి, ముక్కు, గొంతు, ఆర్థోపెడిక్, డెంటల్, చర్మ వ్యాధులు, ఫిజియోథెరపీ డిపార్ట్‌మెంట్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
మ్యాన్యువల్ విధానంలో ఓపీ చిట్టీలు రాసి రోగులకు ఇచ్చారు. ఎమర్జెన్సీ విభాగంలో సైతం కొద్దిసేపు విద్యుత్ అంతరాయం ఏర్పడడంతో రోగులు ఇబ్బందులు పడ్డారు. విషయం తెలుసుకున్న ఆఫీసర్లు హాస్పిటల్‌కు చేరుకొని మధ్యాహ్నం వరకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో రోగులు ఊపిరి పీల్చుకున్నారు.

