అబ్దుల్లాపూర్‌మెట్/గోషామహల్, వెలుగు: అబ్దుల్లాపూర్‌మెట్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ వద్ద ఎయిర్ ఇండియా బస్సు పూర్తిగా కాలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం శంషాబాద్ నుంచి ఓఆర్ఆర్మీదుగా ఎల్బీనగర్ ఆటోనగర్‌కు వెళ్తున్న ఈ బస్సు ఇంజిన్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగలు వచ్చాయి. బస్సులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం, గమనించిన డ్రైవర్, క్లీనర్ వెంటనే కిందకు దూకేయడంతో పెను ప్రమాదం తప్పింది.
సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకొని మంటలు అదుపు చేయగా, అప్పటికే బస్సు పూర్తిగా కాలిపోయింది. ఈ ఘటనపై హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఎంజీబీఎస్‌లోనూ ప్రమాదం.. ఆలస్యంగా వెలుగులోకి
గౌలిగూడలోని మహాత్మా గాంధీ బస్ స్టేషన్ (ఎంజీబీఎస్)లో ఈ నెల 22న గద్వాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు కింద మరమ్మత్తులు చేస్తుండగా, స్వల్పంగా మంటలు చెలరేగాయి. బస్సు స్టార్ట్ కాకపోవడంతో గ్యారేజీ మెకానిక్ కిందకు వెళ్లి రిపేర్ చేస్తుండగా, ఆయిల్ లీకేజీ వల్ల నిప్పురవ్వలు పడి మంటలు వ్యాపించాయి. అక్కడే ఉన్న ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి నీళ్లు చల్లి మంటలను ఆర్పేయడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, బస్సుకు గానీ, మెకానిక్కు గానీ ఎలాంటి నష్టం జరగలేదని ఎంజీబీఎస్ సీఆర్ఎం సుఖేష్ రెడ్డి తెలిపారు.
