జపాన్ ను గడగడలాడిస్తున్న హగిబీస్

జపాన్ ను గడగడలాడిస్తున్న హగిబీస్

టోక్యో: జపాన్‌‌ను పెనుతుపాను హగిబీస్‌‌ గడగడలాడిస్తోంది. తుపాను కారణంగా భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చే అవకాశం ఉన్నట్లు వాతావరణ అధికారులు చెప్పారు. గంటకు 216 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయన్నారు. జపాన్‌‌లోని దక్షిణ, నార్త్‌‌ ఈస్ట్‌‌లో ఉన్న ముంపు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రికార్డు స్థాయిలో వర్షం పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. టోక్యో, టొకాయి రీజియన్‌‌లో రానున్న 24 గంటల్లో దాదాపు 80 సెం.మి. వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. శుక్రవారం ఉదయం సౌత్‌‌ వెస్ట్రన్‌‌కు చేరుకున్న పెను తుపాను క్రమంగా నార్త్‌‌ వెస్ట్‌‌ వైపు సాగుతోందని జపాన్‌‌ వాతావరణ శాఖ చెప్పింది. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

ఫ్లైట్లు, ట్రైన్లు రద్దు

హగిబీస్‌‌ పెను తుపాను కారణంగా జపాన్‌‌ వ్యాప్తంగా ఫ్లైట్లు, రైళ్లను రద్దు చేశారు. రెండు పెద్ద ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ ఆల్‌‌ నిపాన్‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ (ఏఎన్‌‌ఏ), జపాన్‌‌ ఎయిర్‌‌‌‌లైన్స్‌‌ (జేఏఎల్‌‌) దాదాపు 370 డొమస్టిక్‌‌ ఫ్లైట్లను కేన్సిల్‌‌ చేసింది. భారీ వర్షాల కారణంగా రెండు రగ్బీ వరల్డ్‌‌ కప్‌‌ మ్యాచ్‌లను రద్దు చేశారు. సుజాకాలో జరిగాల్సిన గ్రాండ్‌‌ ప్రిక్స్‌‌ను కూడా ఆపేశారు. టోక్యోలోని డిస్నీ లాండ్‌‌, డిస్నీ సీ థీమ్‌‌ పార్క్‌‌ను కూడా మూసేసినట్లు అధికారులు చెప్పారు.