జనంలో ఒకడు..జనంతో ఒకడు

జనంలో ఒకడు..జనంతో ఒకడు

‘అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి’ అంటూ ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. ‘గోకులంలో సీత’ సినిమా చూసి ప్రేక్షకులంతా తమ హృదయాల్లోకి ‘సుస్వాగతం’ చెప్పారు. ‘తొలి ప్రేమ’తో తెలుగువారందరి ‘తమ్ముడు’గా మారిపోయాడు. ‘బద్రి’గా ఆకట్టుకుని ‘జానీ’గా ‘జల్సా’ చేసి అభిమానుల్ని ‘ఖుషీ’ చేశాడు. ‘గుడుంబా శంకర్‌‌’గా గట్స్ చూపించినా ‘పులి’లా ‘పంజా’ విసిరినా ఆయన తర్వాతే ఎవరైనా. ‘గబ్బర్‌‌సింగ్’గా ‘గంగ’తో కలిసి ‘రాంబాబు’గా రఫ్పాడించినా అతనే. ‘కాటమరాయుడు’గా పెద్దరికం చూపి.. ‘సర్దార్ గబ్బర్‌‌సింగ్‌’గా శత్రువుల గుండెల్లో నిద్రపోయాడు. అత్తారింటికి దారి వెతుక్కున్నాడు. ‘అజ్ఞాతవాసి’గా అందరి ముందుకీ వచ్చాడు. ‘వకీల్‌సాబ్‌’గా ఆడపిల్లలకి న్యాయం చేసి, ‘భీమ్లానాయక్‌’గా ఎందరికో భరోసా ఇచ్చాడు. ‘హరిహరవీరమల్లు’గా వస్తానంటూ... ‘భవదీయుడు భగత్‌సింగ్‌’గానూ సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. 

చక్కగా నటిస్తాడు. దర్శకుడిగా నటీనటుల్ని గైడ్ చేస్తాడు. ఫైట్లు కంపోజ్ చేస్తాడు. పాటలు పాడి స్టెప్పులేయిస్తాడు. ఏం చేసినా తనదంటూ ఓ ప్రత్యేక శైలి. అన్న పరిచిన బాటలో అడుగులు వేసినా.. ఆయన్ని మించిన అభిమానగణాన్ని సంపాదించాడు. జనంలో ఒకడినంటాడు. జనంతోనే ఉంటానంటాడు. తనని అభిమానించేవారికి దాసోహమంటాడు. వారి కోసం ఏం చేయడానికైనా సిద్ధమంటాడు. వెండితెరపై చూపులతో గాలం వేస్తాడు. తెర వెనుక మాటలతో మంత్రం వేస్తాడు. 

చదివింది ఇంటర్ అయినా అపారమైన జ్ఞానాన్ని ప్రదర్శిస్తాడు. ఎదుట ఎవరున్నా వారి మనసుల్ని చదివేసి తనవైపు తిప్పేసుకుంటాడు. కుటుంబమంటే ఎడతెగని అభిమానం. పుస్తకాలతో నిరంతరం సహవాసం. ఆయన అత్యంత విలువిచ్చేది స్నేహం. అందరివాడిగా బతకడమే ఆయన అభిమతం. అందుకేనేమో.. ఇండస్ట్రీలో పవర్‌‌ స్టార్ అయ్యాడు. రియల్‌ లైఫ్‌లో పవర్‌‌ఫుల్‌ లీడర్‌‌గా ఎదిగే ప్రయత్నంలో ఉన్నాడు. 

ఏదేమైనా.. ఎవరేమన్నా.. తన దారిలో తాను సాగిపోవడం పవన్ ప్రత్యేకత. కోరుకున్న గమ్యం చేరేవరకు తన నడక ఆగదంటున్నాడు. ఆయన మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటూ.. పవర్‌‌స్టార్‌‌గా వెండితెరని మరెన్నో ఏళ్లు ఏలాలని ఆశిస్తూ.. పవన్ కళ్యాణ్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.