PPF:  ప్రభుత్వ పథకం.. నెలకు రూ.5వేల పొదుపుతో కోటి రూపాయలు

PPF:  ప్రభుత్వ పథకం.. నెలకు రూ.5వేల పొదుపుతో కోటి రూపాయలు

కష్టాలు ఎప్పుడు, ఎవరిని ధరిచేరతాయో ఎవరో ఊహించలేం. అందునా, కరోనా వంటి మహమ్మారులు పుట్టుకొచ్చి జీవితాన్ని మరింత చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో సంపాదించిన దానిలో నాలుగు రాళ్లు దాచుకోవడం మీ జీవితానికి ఎంతో కొంత భరోసానిస్తాయి. అలా పొదుపు చేయాలనుకున్నవారికి సురక్షితమైన పథకం.. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్. ఇదొక దీర్ఘకాలిక పెట్టుబడి సాధనం. పొదుపు చేసేది తక్కువ మొత్తమైనా.. ఎక్కువ కాలం పాటు పొదుపు చేస్తే ఆకర్షణీయమైన రాబడి పొందవచ్చు.

చిన్న మొత్తాల పొదుపులకు అధిక రాబడులిచ్చే ఉద్దేశంతో 1968లో కేంద్రం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్‌)ను తీసుకొచ్చింది. పొదుపుపై వచ్చే వడ్డీ, రాబడిపై ఆదాయ పన్ను లేకపోవడం ఈ పథకం యొక్క మరో బెనిఫిట్. వయోజన భారతీయులెవరైనా ఈ ఖాతా తెరవవచ్చు. ఒక మైనర్ పక్షాన సంరక్షకుడు కూడా ఈ ఖాతా తెరవచ్చు. ఏదేని బ్యాంకు లేదా పోస్టాఫీస్‌ శాఖల్లో కనీసం రూ. 100 డిపాజిట్ చేయడం ద్వారా  పీపీఎఫ్ ఖాతా తెరవొచ్చు. ఖాతా తెరవడానికి గుర్తింపు ధృవీకరణ పత్రం, చిరునామా ధృవీకరణ పత్రం వంటి కేవైసీ (నో యువర్ కస్టమర్) పత్రాలు అవసరమవుతాయి. 

పీపీఎఫ్‌ ఖాతాలో ప్రతి ఏడాది కనీసం రూ.500 పొదుపు చేయాలి. ఇది తప్పనిసరి. గరిష్టంగా ఏడాదికి రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇది ఏడాదికి ఒకసారైనా లేదా వాయిదాల పద్ధతిలోనైనా చెల్లించవచ్చు. వడ్డీ రేటు  అనేది ప్రతి మూడు నెలలకోసారి మారుతుంటుంది. కేంద్ర ఆర్థిక శాఖ వడ్డీ రేటు నిర్ణయిస్తుంది. పెట్టుబడిపై వచ్చిన వడ్డీ ప్రతి ఆర్థిక సంవత్సరం చివరన ఖాతాలో జమవుతుంది. పీపీఎఫ్ ఖాతాపై రుణ సదుపాయం కూడా ఉంది.

రూ.16 లక్షలు

పీపీఎఫ్ అకౌంట్ కాల పరిమితి(మెచ్యూరిటీ పీరియడ్) 15 సంవత్సరాలు. దీన్ని కావాలనుకుంటే అయిదేళ్లు చొప్పున దీర్ఘ కాలం పొడిగించవచ్చు. అలా చేయడం ద్వారా ఎక్కువ రాబడి పొందవచ్చు.ఉదాహరణకు మీరు 25 సంవత్సరాల వయస్సులో PPFలో నెలకు రూ. 5000 పెట్టుబడి పెట్టడం ప్రారంభించారనుకోండి, అప్పుడు వార్షిక మొత్తం రూ. 60,000 చొప్పున మొత్తం పెట్టుబడి రూ. 9,00,000 అవుతుంది. దీనికి 7.1 శాతం వడ్డీ రేటు ప్రకారం.. మీరు 15 సంవత్సరాలలో రూ. 7,27,284 సంపాదిస్తారు. ఆ సమయంలో మెచ్యూరిటీ మొత్తం రూ.16,27,284 అవుతుంది. 

 37 ఏళ్లకు రూ.కోటి 5 లక్షలు

మీరు ఈ పెట్టుబడిని నెలకు రూ. 5,000 చొప్పున 37 సంవత్సరాల పాటు కొనసాగిస్తే.. మొత్తం పెట్టుబడి రూ. 22,20,000 కాగా, రూ. 83,27,232 రాబడి ఇస్తుంది. మెచ్యూరిటీ మొత్తం రూ. 1,05,47,232 అవుతుంది. ఇలా  మీరు 37 ఏళ్ల పాటు పొడిగించాలనుకుంటే 15వ, 20వ, 25వ, 30వ, 35 సంవత్సరాలలో ఖాతా తెరిచిన శాఖలో తెలియజేయాలి.