
హైదరాబాద్: తెలంగాణ పాలిటిక్స్‌ను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో పోలీసులు అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేశారు. ముందస్తు బెయిల్ పిటిషన్లో ప్రభాకర్ కీలక విషయాలు పేర్కొన్నారు. ప్రస్తుతం తనకు 65 ఏళ్ల వయసు ఉందని.. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నానని తెలిపారు.
అంతేకాకుండా.. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్ళినట్టు ఇది వరకే నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అమెరికా వెళ్ళిన దర్యాప్తు అధికారితో టచ్‌లో ఉన్నానని.. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించడానికి సిద్ధమని తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవని పేర్కొన్నారు. ఈ కేసులో పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు కాబట్టి తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశానని తెలిపారు. బెయిల్ లభించిన కేసు దర్యాప్తునకు పూర్తిగా సహకకరించడానికి సిద్ధంగా ఉన్నానని పిటిషన్లో పేర్కొన్నారు.
కాగా, ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాలను కుదిపేసిన విషయం తెలిసిందే. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పలువురు ప్రతిపక్ష నాయకులు, సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలు, న్యాయమూర్తులు, బిల్డర్ల ఫోన్లు ట్యాపింగ్ చేసినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అప్పటి స్పెషల్ ఇంటలిజెన్స్ బ్యూరో చీఫ్ ప్రభాకర్ రావు పర్యవేక్షణలోనే ఇదంతా జరిగిందని పోలీసులు ఆయనతో పాటు మరో ముగ్గురు అధికారులపై కేసు నమోదు చేశారు. ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్నలు ఈ కేసులో అరెస్ట్ అయ్యి బెయిల్ మీద బయట ఉన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు మాత్రం అమెరికా వెళ్లిపోయారు.
ALSO READ : బీదర్లో కేసీఆర్‌కు దొంగ నోట్ల ప్రింటింగ్ ప్రెస్: బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
ఫోన్ ట్యాపింగ్ కేసును సీరియస్ గా తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం.. విదేశాలకు పారిపోయిన ప్రభాకర్ రావు ఇదే కేసులో నిందితుడిగా ఉన్న శ్రవణ్ రావులను తిరిగి ఇండియాకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే కేంద్ర ప్రభుత్వం సాయంతో ఇంటర్ పోల్ ను ఆశ్రయించింది తెలంగాణ ప్రభుత్వం. ఇటీవలే ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభాకర్ రావు తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం స్టేట్ పాలిటిక్స్ లో చర్చనీయాంశంగా మారింది. మరీ ప్రభాకర్ రావుకు హైకోర్టు బెయిల్ ఇస్తుందో లేదా చూడాలి.