
స్టార్ హీరోలకు క్రేజీ డైరెక్టర్స్ తోడయితే ఆ ప్రాజెక్ట్‌పై ఓ రేంజ్‌లో బజ్ క్రియేటవుతుంది. ప్రభాస్ తన ప్రతి సినిమాకీ అలాంటి కాంబోనే సెట్ చేసుకుంటూ ఉండటంతో ఆ చిత్రాల గురించి చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ‘రాధేశ్యామ్’ తర్వాత నాగ్ అశ్విన్‌తో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. ఇది ప్రభాస్‌కి ఇరవై ఒకటో సినిమా. కానీ ప్రశాంత్ నీల్‌తో ‘సాలార్’, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో ‘ఆదిపురుష్’ చిత్రాలను ముందుగా మొదలు పెట్టేయడంతో నాగ్ అశ్విన్ మూవీ ఆలస్యమవుతూ వచ్చింది. సైఫై సినిమా కావడంతో ప్రీ ప్రొడక్షన్‌కి ఎక్కువ టైమ్ పడుతుందని నాగ్ అశ్విన్ కూడా చెప్పాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనుకున్న దానికంటే లేటవుతుందేమోననే సందేహాలు ఇప్పుడు మొదలయ్యాయి. దానికి కారణం.. సినిమాటోగ్రాఫర్ డ్యానీ శాంచెజ్ లోపెజ్ సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ స్టార్టయ్యిందని చెప్పిన డ్యానీ.. ప్రభాస్ 25 అనే హ్యాష్‌ట్యాగ్ ఇవ్వడంతో ఒక్కసారిగా అందరి దృష్టీ అటువైపు మళ్లింది. ఎందుకంటే ‘రాధేశ్యామ్’ ఇరవయ్యో సినిమా కాబట్టి ఆ తర్వాత సెట్స్‌కి వెళ్లిన సాలార్, ఆదిపురుష్ చిత్రాలు ఇరవై ఒకటి, రెండు చిత్రాలవుతాయి. ఆ లెక్కన నాగ్ అశ్విన్ చిత్రం ఇరవై మూడోది అవ్వాలి. కానీ ఇరవై అయిదు అని డ్యానీ ఎందుకన్నాడనేదే ఇప్పుడొచ్చిన డౌట్. అంటే ఈ సినిమా ఇప్పుడప్పుడే సెట్స్‌కి వెళ్లదా, దీని కంటే ముందు ప్రభాస్ మరో రెండు సినిమాలు చేస్తాడా అంటూ అందరూ డైలమాలో పడ్డారు. ఈ లెక్క తేలాలంటే నాగ్ అశ్విన్ కానీ, ప్రభాస్ కానీ క్లారిటీ ఇవ్వాల్సిందే. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ అయితే ఫాస్ట్‌గా సాగుతోంది. అశ్వినీదత్ భారీ బడ్జెట్‌తో ప్యాన్ ఇండియా రేంజ్‌లో నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్ తదితరులు నటిస్తూ ఉండటంతో అంచనాలూ ఓ రేంజ్‌లో ఉన్నాయి. మరి సినిమా ఎప్పటికి సెట్స్‌కి వెళ్తుందో చూడాలి.