బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్ క్లాసిక్ చెస్ టోర్నీలో ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద ఓటమిపాలయ్యాడు. గురువారం జరిగిన ఏడో రౌండ్‌లో ప్రజ్ఞానంద 33 ఎత్తుల వద్ద ఫ్యాబియానో కరువాన (అమెరికా) చేతిలో పరాజయం చవిచూశాడు. ఈ రౌండ్ తర్వాత ఇండియన్ ప్లేయర్ మూడున్నర పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతుండగా, కరువాన 4.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్ ప్లేస్‌లో నిలిచాడు.
తెల్ల పావులతో ఆడిన ఇండియన్ ప్లేయర్ గేమ్ మధ్యలో కీలక తప్పిదాలు చేశాడు. దీన్ని ఆసరాగా చేసుకున్న కరువాన వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి గేమ్‌ను ముగించాడు. విన్సెంట్ కీమర్ (జర్మనీ)తో జరిగిన గేమ్‌లో జావోకిర్ సిందరోవ్ (ఉజ్బెకిస్తాన్) 40 ఎత్తుల వద్ద నెగ్గాడు. కీమర్ కూడా నాలుగున్నర పాయింట్లతో ఉన్నాడు. అలీరెజా ఫిరౌజ (ఫ్రాన్స్)తో జరిగిన గేమ్‌లో జోర్డాన్ వాన్ ఫోరెస్ట్ (నెదర్లాండ్స్) విజయం సాధించాడు. మాక్సిమ్ వాచిర్ లాగ్రెవ్ (ఫ్రాన్స్).. బోగ్దాన్ డానియెల్ (రొమేనియా) మధ్య జరిగిన గేమ్ 46 ఎత్తుల వద్ద డ్రా అయ్యింది.
