బుకారెస్ట్: గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా జరుగుతున్న సూపర్ క్లాసిక్ టోర్నీలో.. ఇండియా గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద వరుసగా నాలుగో డ్రా నమోదు చేశాడు. వెస్లీ సో (అమెరికా)తో మంగళవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్‌ను ప్రజ్ఞా 45 ఎత్తుల వద్ద డ్రాగా ముగించాడు.
బెర్లిన్ డిఫెన్స్‌తో ఆడిన ఇండియన్ ప్లేయర్.. మిడిల్ గేమ్‌లో వ్యూహాత్మకంగా వ్యవహరించాడు. కింగ్ సైడ్ నుంచి వెస్లీ పట్టు బిగించే ప్రయత్నం చేసినా.. ప్రజ్ఞానంద ప్రతి వ్యూహాలతో తిప్పికొట్టాడు. దాంతో మ్యాచ్ డ్రా వైపు వెళ్లింది. ఈ రౌండ్ తర్వాత ప్రజ్ఞానంద మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో ప్లేస్‌లో కొనసాగుతున్నాడు.
