ఓస్లో: నార్వే చెస్ 2026 టోర్నీలో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన చేశాడు. ఎనిమిదో రౌండ్‌లో ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్‌ను క్లాసికల్ గేమ్‌లో వరుసగా రెండోసారి ఓడించి సంచలనం సృష్టించాడు. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో కార్ల్‌సన్‌ను ఒకే ఏడాది రెండుసార్లు ఓడించిన ఏకైక ఆటగాడిగా ప్రజ్ఞానంద అరుదైన రికార్డు సాధించాడు.
ఈ విజయంతో 12 పాయింట్లతో మూడో స్థానానికి చేరిన ప్రజ్ఞానంద, టైటిల్ రేసులో బలంగా నిలిచాడు. ప్రస్తుత లీడర్ వెస్లీ సో 14 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. మరోవైపు గుకేశ్ టైటిల్ ఆశలు పూర్తిగా ముగిశాయి. ఫ్రాన్స్ ఆటగాడు అలీరెజా ఫిరౌజ్జా చేతిలో ఓటమి పాలైన గుకేశ్, ఎనిమిది పాయింట్లతో పట్టికలో చివరి స్థానానికి పడిపోయాడు.
మహిళల విభాగంలో కజకిస్తాన్ ప్లేయర్బిబిసార అసౌబయేవా చేతిలో భారత క్రీడాకారిణి దివ్య దేశ్‌ముఖ్ (10 పాయింట్లు) ఓటమి చవిచూడగా, కోనేరు హంపి (8 పాయింట్లు) అన్నా ముజిచుక్‌తో మ్యాచ్‌ను డ్రా చేసుకుని అర్మగెడాన్ ద్వారా బోనస్ పాయింట్లు సాధించింది.
