బీజేపీ హయాంలో రాజ్యాంగ ఉల్లంఘనలు

బీజేపీ హయాంలో రాజ్యాంగ ఉల్లంఘనలు
  •     పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ ఆరోపణ
  •     లండన్‌‌లో కాంగ్రెస్ ప్రజా దీవెన సభ

హైదరాబాద్, వెలుగు : కేంద్రంలోని బీజేపీ హయాంలో అనేక రాజ్యాంగ ఉల్లంఘనలు జరిగాయని పీసీసీ ఎన్ఆర్ఐ సెల్ కన్వీనర్ గంప వేణుగోపాల్ పేర్కొన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, మానవ హక్కులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం లండన్‌‌లో పీసీసీ ఎన్ఐఆర్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన ప్రజా దీవెన సభలో వేణుగోపాల్ మాట్లాడారు. 2018లో పీఎంఎల్ఏ చట్టాన్ని సవరించి బెయిల్ పొందడాన్ని కష్టతరం చేశారన్నారు. ఎలక్టోరల్ బాండ్ పాలసీ పేరిట ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతి స్కీమ్​ను తెచ్చారన్నారు.

మీడియాతో సహా అన్ని సంస్థలపై నియంత్రణ, పార్టీలను విచ్ఛిన్నం చేయడం, ప్రతిపక్షాల ఖాతాలను ఫ్రీజ్ చేయడం, సీఎంల అరెస్ట్ వంటి ఘటనలు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్​షా కుట్రలేనని ఆరోపించారు. కాంగ్రెస్‌‌ను దెబ్బతీసే ప్రయత్నాలు స్పష్టంగా కనిపిస్తున్నాయన్నారు. అందులో భాగంగానే రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసేందుకు విచిత్రమైన పరువునష్టం కేసు పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్, సీపీఐకు ఐటీ నోటీసులివ్వడం, ఇష్టారీతిన ఎన్నికల కమిషనర్లను నియమించడంపై వేణుగోపాల్ ఆందోళ వ్యక్తం చేశారు. 

ఎన్ఆర్ఐ సెల్ కో కన్వీనర్ సుధాకర్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణలో 14 సీట్లు గెలవబోతున్నామన్నారు. మత పరమైన రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. సభలో ప్రధాన కార్యదర్శి శ్రీధర్ నీలా, శీలం శ్రీనివాస్ రెడ్డి, మధుకర్ రెడ్డి, అ మర పాల్ రెడ్డి, మరుపల్లి అవినాశ్​గౌడ్, అభినవ్ రెడ్డి, కిట్టు రెడ్డి,రాజేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.