వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర

వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర
  • ఘన స్వాగతం పలికిన యాదాద్రి జనం
  • ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కదిలిన సంజయ్​
  • సమస్యలు చెప్పుకున్న అన్ని వర్గాల ప్రజలు
  • మూడో రోజు 11 కిలోమీటర్లు.. 

యాదాద్రి, వెలుగు:  ప్రజా సంగ్రామ యాత్ర  మూడో రోజు జోరు వానలోనే కొనసాగింది. బీజేపీ స్టేట్ ​ప్రెసిడెంట్ బండి సంజయ్​ ప్రజల కష్ట సుఖాలు తెలుసుకుంటూ 11 కిలోమీటర్లు నడిచారు.  గురువారం బీజేపీ యాదాద్రి జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు ఆధ్వర్యంలో భువనగిరి శివారు నుంచి యాత్ర మొదలైంది. ముందుగా బండి సంజయ్​ను టీచర్స్​యూనియన్​ ‘తపస్’​ లీడర్లు కలసి  గవర్నమెంట్​స్కూల్స్​లో నెలకొన్న సమస్యలను వివరించారు.  అనంతరం తెలంగాణ స్కూల్ మేనేజ్ మెంట్ అసోసియేషన్ (ట్రెస్మా) ప్రతినిధులు కలిసి, ప్రభుత్వ వైఖరి తో స్కూల్స్​ నడపలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.  తెలంగాణ జర్నలిస్ట్​ యూనియన్​ మెంబర్లు కలిసి ఇండ్ల స్థలాలు ఇస్తలేరని చెప్పారు. బీజేపీ అధికారంలోకి  రాగానే ఇండ్ల స్థలాలతో పాటు జర్నలిస్టులకు ఇండ్లు కూడా కట్టిస్తామని సంజయ్​ హామీ ఇచ్చారు. జీఎన్​ఆర్​ ఫౌండేషన్​ నిర్వహించిన కోచింగ్​ సెంటర్​ స్టూడెంట్లు బండిని కలిశారు.  అనంతరం యాత్ర సాగుతుండగానే  వర్షం ప్రారంభమైంది.  వర్షంలోనే  బీబీనగర్​ మండలం గొల్లగూడెం, మఖ్దూంపల్లికి యాత్ర చేరుకుంది. వర్షాన్ని లెక్క చేయకుండా పెద్ద ఎత్తున కార్యకర్తలు, ప్రజలు ‘బండి’ వెంట నడిచారు.  ఆయా గ్రామాల ప్రజలు వానలోనే  సంజయ్​ను కలసి వారి ఇబ్బందులను చెప్పుకున్నారు.  అనంతరం పలుగు తండా వైపుగా పాదయాత్ర కదిలింది. గిరిజన మహిళలు, యువకులు తరలివచ్చి గిరిజన సంప్రదాయ పద్ధతిలో  భారీ ఎత్తున స్వాగతం పలికారు. కోలాటాలు వేస్తూ.. డ్యాన్సులు చేస్తూ..  తిలకం దిద్ది బండి  సంజయ్ ను తమ తండాలోకి తీసుకెళ్లారు. తండాలో రోడ్లు లేవని, ఇండ్లు లేవని, సరైన సౌలత్​లు లేవని వాపోయారు. అనంతరం పలుగు తండావాసులతో కలిసి ‘రచ్చబండ’ నిర్వహించిన బండి సంజయ్ వారి  సమస్యలన్నీ సావధానంగా విన్నారు. గిరిజనుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలను వివరించడంతోపాటు పలుగు తండాకు మోదీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను లెక్కలతో సహా వివరించారు. 

డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తేనే గిరిజనులకు న్యాయం 

ఇప్పటి వరకు హస్తం, సైకిల్, కారు గుర్తులకు ఓటేశారని.. అయినా తండాలు బాగుపడలేదని బండి సంజయ్​ అన్నారు. ఈ సారి పువ్వు గుర్తుకు ఓటేస్తే తండాలకు గుడి, బడితోపాటు రోడ్లు, టాయిలెట్లు  అన్ని కట్టిస్తామని  హామీ ఇచ్చారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్​రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్​, స్టేట్​ లీడర్లు సంగప్ప, గూడూరు నారాయణరెడ్డి, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, రాణి రుద్రమ  ఉన్నారు.