- 1 నుంచి 9 వరకు ప్రారంభోత్సవాలు
- మొదటి రోజు సెకండ్ ఫేజ్ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ బడులకు శంకుస్థాపన
- చివరి రోజు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ
- ట్యాంక్‌బండ్‌పై ముగింపు వేడుకలు
హైదరాబాద్, వెలుగు: ప్రజాపాలన విజయోత్సవాలపై రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ రిలీజ్ చేసింది. వచ్చే నెల 1 నుంచి 9 దాకా వరుస కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మొదటి రోజు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ రెండో దశకు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా విద్యార్థుల కోసం వ్యాసరచన, సీఎం కప్ పోటీలు (డిసెంబర్ 1 నుంచి 8 వరకు) నిర్వహించనున్నారు.
రెండో తేదీన 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు, 213 కొత్త అంబులెన్సులు, 33 ట్రాన్స్ జెండర్ క్లినిక్‌లు, ట్రాఫిక్ వలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లపై పైలట్ ప్రాజెక్టు ప్రారంభించనున్నారు. 3న రూ.150 కోట్ల విలువైన బ్యూటిఫికేషన్ పనులు, కేబీఆర్ పార్క్ సమీపంలో 6 జంక్షన్ల అభివృద్ధి పనులు ప్రారంభించనున్నారు. 4న తెలంగాణ ఫారెస్ట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ భవన శంకుస్థాపన, వర్చువల్ సఫారీ, వృక్ష పరిచయం కేంద్రాన్ని ఓపెన్ చేయనున్నారు.
అలాగే, 9,007 మందికి నియామక పత్రాల పంపిణీ చేపట్టనున్నారు. 5న ఇందిరా మహిళా శక్తి బజార్ ప్రారంభం, మేడ్చల్, మల్లేపల్లి, నల్గొండలోని ఐటీఐల్లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ సెంటర్లు, ఘట్కేసర్ లో బాలికల ఐటీఐ కాలేజీని స్టార్ట్ చేయనున్నారు. 6న యాదాద్రి పవర్ ప్లాంట్ లో విద్యుదుత్పత్తి ప్రారంభించనున్నారు. అదే రోజు 244 సబ్స్టేషన్లకు శంకుస్థాపన చేయనున్నారు. 7న స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ప్రారంభం, పోలీస్ బ్యాండ్ ప్రదర్శన.
తెలంగాణ కళా ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. 8న 7 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్టులు, ఏఐ సిటీకి భూమిపూజ, 130 కొత్త మీ సేవా కేంద్రాలు, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేయడంతో పాటు కళా ప్రదర్శనలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహించనున్నారు. చివరి రోజు 9న లక్షలాది మంది మహిళా శక్తి సభ్యుల సమక్షంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ట్యాంక్ బండ్ మీద డ్రోన్ షో, ఫైర్ వర్క్, ఆర్ట్ గ్యాలరీ, వివిధ స్టాళ్ల ఏర్పాటుతో ముగింపు వేడుకలు ఉంటాయి.