- పథకాలను, అభివృద్ధిని ప్రజలకు చేరువ చేసేందుకే ‘ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక’
- గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు సక్సెస్ చేయాలి..సీఎం రేవంత్
- పథకాలు, పౌరసేవలన్నీ ఆన్‌లైన్‌లోనే అందించాలి
- పరిపాలనలో టెక్నాలజీ వినియోగంపై జయేశ్ రంజన్ కమిటీ ఏర్పాటు చేయాలి
- రూ. 8 లక్షల కోట్ల పెట్టుబడుల ఎంవోయూలు గ్రౌండ్ అయ్యేలా ప్రత్యేక కార్యాచరణ
- జూన్ 2న ‘తెలంగాణ పండుగ’ను ఘనంగా జరుపుకోవాలి
- అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ విస్తృతస్థాయి సమీక్ష
హైదరాబాద్, వెలుగు: ప్రజాప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేయాలనే సంకల్పంతో రాష్ట్రంలో ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం చేపడుతున్నట్టు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ఈ ప్రణాళిక అమలు చేయాలని అన్ని శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులను ఆదేశించారు. ఇప్పటివరకు సాధించిన విజయాలను నిజాయితీగా అంచనా వేసుకొని, ఎక్కడ లోటుపాట్లు ఉన్నాయో గుర్తించాలని సూచించారు.
వచ్చే ఎన్నికలకు మిగిలిన రెండేండ్ల తొమ్మిది నెలలకు సరైన దిశా నిర్దేశంతో కార్యాచరణ రూపొందించుకోవాలని తెలిపారు. ప్రజలు చూపిన విశ్వాసాన్ని మాటలతో కాకుండా సుపరిపాలనతో గౌరవించాల్సిన బాధ్యత తనతోపాటు అధికారులు అందరిపైనా ఉందన్నారు. జూన్2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని సంబురంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకను పురస్కరించుకొని 99 రోజుల పాటు జరిగే ‘ప్రజా పాలన– ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమాన్ని బాధ్యతగా నిర్వర్తించాలని అధికారులను ఆదేశించారు. శనివారం సెక్రటేరియెట్‌లో అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
గ్రామస్థాయి నుంచి మండలస్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి వరకు షెడ్యూలు ప్రకారం కార్యక్రమాలను విజయవంతం చేయాలని, అందుకు అవసరమైన ప్రణాళికను వెంటనే సిద్ధం చేసి ఆచరణలో చూపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక లోగో తయారు చేయాలని, రాష్ట్రమంతటా నిర్వహించే కార్యక్రమాలకు షెడ్యూల్రూపొందించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఫైళ్లలో ఉన్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఫలితాలుగా మారాలని, ప్రజలకు పథకాల ప్రయోజనం ప్రత్యక్షంగా చేరేలా యంత్రాంగం మొత్తం ఒకే లక్ష్యంతో పనిచేయాలని సూచించారు. ఈ 99 రోజుల్లో ఫైళ్ల క్లియరెన్స్‌తోపాటు అన్ని విభాగాలు, రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు అన్ని ఆఫీసుల్లో పారిశుధ్యం, పరిశుభ్రత డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ ఫైళ్ల క్లియరెన్స్‌తోపాటు ప్రతి శాఖ, ప్రతి జిల్లా, ప్రతి అధికారి మిషన్ మోడ్‌లో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎస్ రామకృష్ణారావు, డీపీజీ శివధర్‌రెడ్డితోపాటు సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎంవో అధికారులు, అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
సాంకేతిక సంస్కరణలపై కమిటీ
వచ్చే 99 రోజులు అత్యంత కీలకమని, ప్రతి రోజూ బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని అధికారులకు సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ కార్యక్రమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయవవద్దని, పక్కాగా అమలు చేయాలని ఆదేశించారు. 99 రోజుల కార్యక్రమ పురోగతిని వ్యక్తిగతంగా పరిశీలిస్తానని, క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తానని తెలిపారు. అధికారుల పనితీరులో లోపాలను సహించబోమని అన్నారు.
‘‘ఐఏఎస్ అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక. ప్రభుత్వం అమలు చేసే ప్రతి పథకం, అమల్లోకి తెచ్చిన ప్రతి పాలసీ విజయం మీపైనే ఆధారపడి ఉంటుంది. శాఖల మధ్య సమన్వయం కీలకం. ప్రజా పాలన-– ప్రగతి ప్రణాళిక కార్యక్రమం విజయవంతం కావాలంటే విభాగాల మధ్య అడ్డంకులు తొలగిపోవాలి. పరిపాలనలో అధునాతన టెక్నాలజీని మరింత సమర్థంగా వినియోగించుకోవాలి” అని అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో పథకాలు, పౌర సేవలన్నింటినీ మరింత సులభతరం చేయాలని, కరెంట్ మీటర్, ఇంటి అనుమతి, నల్లా కనెక్షన్ మొదలు ప్రభుత్వం నుంచి పొందాల్సిన అనుమతులు, సేవల కోసం ప్రజలు ఆఫీసులకు రావాల్సిన అవసరం లేకుండా చూడాలన్నారు. వెహికల్ కొన్న షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్ జరిగే విధానం అమల్లోకి వచ్చిందని, ఇలా ప్రతి విభాగంలోనూ సంస్కరణలు తీసుకురావాలని చెప్పారు.
ఏ ఫైలు, ఏ అర్జీ ఎక్కడ ఉందో దరఖాస్తుదారు తెలుసుకునేలా ఉండాలని సూచించారు. సమూల మార్పులతో సాంకేతిక సంస్కరణలు అమలు చేసేందుకు సీనియర్ ఐఏఎస్ జయేశ్ రంజన్ అధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేయాలని సీఎం ఆదేశించారు. 3 వారాల్లో కమిటీ తమ నివేదికను అందజేయాలని చెప్పారు.
ప్రతి విభాగంలో ఈ ఆఫీస్ విధానం, డిజిటల్ గవర్నెన్స్ విధానం అమలు చేయాలని, అన్ని శాఖలకు సంబంధించిన డేటా నిల్వ చేస్తున్న పాత కాలం సర్వర్స్‌ను రాబోయే 20 ఏండ్లకు సరిపడేలా అప్ డేట్ చేసుకోవాలని చెప్పారు. సంక్షేమ పథకాలు పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులోనూ సాంకేతికతను వినియోగించుకోవాలని సూచించారు. మహాలక్ష్మి, రేషన్ కార్డులు, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్తు, ఆరోగ్య శ్రీ అర్హులైన వారందరికీ చేరాలని, సొంత స్థలం ఉండి ఇల్లు లేని వారందరికీ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధి అందించాలన్నారు. రేషన్ కార్డులు అప్లై చేసుకునే ప్రక్రియ నిరంతరం కొనసాగాలని తెలిపారు.
ఐఏఎస్‌లు బెస్ట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి..
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా నాణ్యమైన విద్య ను అందించేలా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలోని 100 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభిస్తామన్నారు. ప్రభుత్వ విద్యను ప్రక్షాళన చేయడంతోపాటు ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్య సేవలను మెరుగుపరిచే విధానాలు అమలు చేయాలని సూచించారు. ప్రతి ఐఏఎస్ అధికారి తమ శాఖలో బెస్ట్ ప్రోగ్రామ్‌ను డిజైన్ చేసుకోవాలని, తమంత తాముగా గర్వపడే కార్యక్రమాలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ పథకాలు, హామీలు ప్రజలకు మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశ అభివృద్ధి పథంలోనూ, పరిపాలనలోనూ తెలంగాణను తిరుగులేని ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టాలనే లక్ష్యంతో పని చేయాలని సూచించారు.
కలెక్టర్లతో కాన్ఫరెన్స్ వాయిదా
కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటు చేసిన కాన్పరెన్స్ వాయిదా పడింది. ఆదివారం నిర్వహించాల్సిన ఈ కాన్ఫరెన్స్ వచ్చే నెల 4వ తేదీకి పోస్ట్‌పోన్ చేసినట్టు తెలిసింది. సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఉండటంతోనే కలెక్టర్ల కాన్ఫరెన్స్ వాయిదా వేసినట్టు సమాచారం.
10 వేల చదరపు కిలోమీటర్లు మాన్యుఫాక్చరింగ్ జోన్
తెలంగాణ రైజింగ్ విజన్‌లో భాగంగా ప్రభుత్వం రాష్ట్రాన్ని క్యూర్, ప్యూర్, రేర్ అనే మూడు జోన్లుగా విభజించి.. దేశంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నదని సీఎం రేవంత్ చెప్పారు. కోర్ అర్బన్ రీజియన్‌లో చేపట్టాల్సిన సర్వీస్ సెక్టార్ అభివృద్ధికి ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీకి అవసరమైన మాన్యుఫాక్చరింగ్ జోన్ భవిష్యత్తులోనూ కీలకంగా మారుతుందన్నారు. దాదాపు 10 వేల చదరపు కిలో మీటర్ల పరిధిలో విస్తరించే మాన్యుఫాక్చరింగ్ రంగం దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. సేవా రంగం, తయారీ రంగంలో వస్తున్న పెను మార్పులను పరిగణనలోకి తీసుకోవాలని, శాఖలపైన ప్రతి ఒక్కరికి సంపూర్ణ అవగాహన ఉండాలని అధికారులకు సూచించారు.
సొంత బిల్డింగ్‌ల కోసం నిధులు..
అన్ని విభాగాల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతోపాటు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల డేటా కార్యదర్శుల వద్ద సిద్ధంగా ఉండాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు. రాష్ట్రంలో మండలస్థాయినుంచి రాష్ట్ర స్థాయి వరకు ప్రభుత్వ కార్యాలయాలేవీ ఇకపై అద్దె భవనాల్లో ఉండకూడదని, ప్రతి శాఖకు సొంత భవనం ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. బడ్జెట్ ప్రతిపాదనలో వీటి నిర్మాణాలను చేర్చాలని సూచించారు. కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను రాబట్టుకునేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని, నిధుల సద్వినియోగం చేపట్టడం వల్ల ప్రత్యేక రాయితీలు, ప్రోత్సాహకాలు కూడా రాష్ట్రం సాధించుకునే అవకాశం ఉంటుందని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్‌తోపాటు వరల్డ్ ఎకనమిక్ ఫోరం, విదేశీ పర్యటనలతో రాష్ట్రానికి దాదాపు రూ.8 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఈ ఎంవోయూలన్నీ ఫలవంతమయ్యేలా కార్యదర్శులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని, అవి గ్రౌండయ్యేంత వరకు సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ ద్వారా ఈ పెట్టుబడులన్నీ సాకారమైతే తెలంగాణ పారిశ్రామిక రంగం ఆశించిన లక్ష్యం నెరవేరుతుందని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా చేపట్టిన ఫ్యూచర్ సిటీ నిర్మాణం, అభివృద్ధిపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఫ్యూచర్ సిటీ దేశ ఆర్థిక స్థితిని మార్చబోతున్నదని తెలిపారు.
పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలకు కోరుకున్న మార్పును అందిస్తామనే హామీతో ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని సీఎం గుర్తుచేశారు. ఈ రోజుతో ప్రభుత్వం రెండేండ్ల మూడు నెలలు పూర్తి చేసుకుందని, ప్రజలు కోరుకున్న మార్పును స్వాగతిస్తున్నారని తెలిపారు. అందుకే వరుస ఎన్నికల్లో ప్రజలు తమ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారని అన్నారు. ప్రజలు ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు పునరంకిత భావంతో ముందుకు సాగాల్సిన సమయం వచ్చిందన్నారు.
