సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌

సెర్బియాలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్ట్‌

హైదరాబాద్, వెలుగుఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యాపారవేత్త నిమ్మగడ్డ ప్రసాద్ ను యూరప్ లోని సెర్బియాలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని వాన్ పిక్ ప్రాజెక్టుకు సంబంధించి రస్ అల్ ఖైమా పెట్టిన కేసు ఆధారంగా బెల్ గ్రేడ్ లో ఆయన్నుఅదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వైఎస్ హయాంలో ప్రకటించిన వాన్ పిక్ (వాడరేవు–నిజాంపట్నం ఇండస్ట్రియల్ కారిడార్) ప్రాజెక్టును నిమ్మగడ్డ ప్రసాద్–రస్ అల్ ఖైమా (యూఏఈలోని ఓ ఎమిరేట్) పార్ట్ నర్ షిప్ తో చేపట్టారు.

గతంలో వైఎస్ జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి రాష్ట్రంలో నిమ్మగడ్డ ప్రసాద్ అరెస్టయ్యారు. తర్వాత బెయిల్ పై విడుదలయ్యారు. వాన్ పిక్ పెట్టుబడుల వ్యవహారంలోనే తాము నష్టపోయినట్లు రస్ అల్ ఖైమా ఇన్వెస్ట్ మెంట్స్ సంస్థ ఇంటర్ పోల్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో సెర్బియాలో వ్యక్తిగత పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రసాద్ ను అదుపులోకి తీసుకున్నారు. దీనిపై సెర్బియా అధికారులతో మాట్లాడాలని ఏపీ నేతలు కొందరు కేంద్ర విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం.