ఎలక్షన్స్ కోసం పీఆర్సీ ఇయ్యం : మంత్రి పువ్వాడ అజయ్

ఎలక్షన్స్ కోసం పీఆర్సీ ఇయ్యం : మంత్రి పువ్వాడ అజయ్
  •     ఏడు డీఏలతో 30 శాతం జీతాలు పెరిగాయి
  •     కార్మికుల కష్టంతోనే ఆర్టీసీ డెవలప్ అయితందని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ కార్మికుల పీఆర్సీ ఫైనాన్స్ అధికారుల పరిశీలనలో ఉందని ట్రాన్స్ పోర్ట్ మినిస్టర్ పువ్వాడ అజయ్ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరిస్తున్నామని, ఎలక్షన్స్ కోసం పీఆర్సీ ఇయ్యమని స్పష్టం చేశారు. 7 డీఏలు ఇవ్వడంతో 30 శాతం జీతాలు  పెరిగాయన్నారు.  మంగళవారం ఎంజీబీఎస్​లో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉందని,  కొన్ని రాష్ట్రాల్లో ఆర్టీసీ లేనేలేదని చెప్పారు. మునుగుతున్న ఆర్టీసీని కేసీఆర్ కాపాడారన్నారు. రూ.1,900 కోట్ల నష్టంలో ఉండగా, ప్రస్తుతం రూ.500 కోట్లకు తగ్గిందన్నారు. యూనియన్లు రద్దు చేసినందుకు లీడర్లకు ఇబ్బందిగా ఉందని, కార్మికులు వారి సమస్యలు చెప్పుకునేందుకు తాను, అధికారులు అందుబాటులో ఉన్నామన్నారు. ఆర్టీసీ మీద నెగిటివ్ వార్తలు రాయొద్దని, ప్రైవేట్ ట్రావెల్స్ మీద రాయాలని ఆయన మీడియాకు సూచించారు. ప్రైవేట్ ట్రావెల్స్ ను అడ్డుకోలేమని, ఆర్టీఏ అధికారులు దాడులు చేస్తున్నారని  చెప్పారు. కార్మికులపై ఫ్లెక్సీ ఏర్పాటు బాధాకరమని, డీఎం అత్యుత్సాహం వల్ల ఆ ఘటన జరిగిందని, అతనిపై చర్యలు తీసుకున్నామని  మంత్రి తెలిపారు. కర్నాటక లాగా మహిళలకు ఫ్రీ జర్నీ లాంటి ప్రతిపాదన ఇక్కడ లేదని మంత్రి స్పష్టం చేశారు.   

బ్లడ్ డొనేషన్ క్యాంపు ప్రారంభం

ఆర్టీసీ బ్లడ్ డొనేషన్ క్యాంపును ఎంజీబీఎస్ లో మంత్రి ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా 101 కేంద్రాల్లో 8వేల మంది కార్మికులు, ఉద్యోగులు రక్తదానం చేస్తున్నారని తెలిపారు. అనంతరం ఎంజీబీఎస్ లో స్టాళ్లను పరిశీలించి ఎంఆర్ పీ కే వస్తువులు అమ్మాలని సూచించారు. బస్సులు ఎక్కి ప్యాసింజర్లతో మాట్లాడి సేవలను అడిగి తెలుసుకున్నారు. డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ లో ఫెసిలిటీస్​ మరింత పెంచాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆర్టీసీ ఎండీ  సజ్జనర్ మాట్లాడుతూ.. రెండేండ్లుగా సంస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారని, ఫలితంగా రాబడి కూడా పెరుగుతున్నదని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం త్వరలోనే మహారాష్ట్రలోని షిర్డీ, ఏపీలోని శ్రీశైలానికి టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువస్తున్నామని తెలిపారు.